మాదకద్రవ్యాల ముఠాలు విచ్చలవిడిగా చెలరేగుతున్నాయి. రోజుకో రీతిలో వాళ్ల ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరాలు, రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించిన వారి నెట్వర్క్ విస్తుబోయేలా చేస్తోంది. డబ్బు సంపాదన కోసం విచక్షణారహితంగా మత్తు వల విసురుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్, సీఐఎస్ఎఫ్, డీఆర్ఐలకు చెందిన కేంద్ర విభాగాలకు చెందిన అధికారులు నిఘా పెడతారు. అయినప్పటికీ కొందరు బంగారం, మత్తు పదార్థలను తరలిస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా జాంబియాకు చెందిన ప్రయాణికురాలి నుంచి డీఆర్ఐ అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
జాంబియా నుంచి జొహెన్నెస్ బర్గ్, దోహా మీదుగా వెళ్తున్న మహిళ ఖతర్ ఎయిర్ వేస్‌లో హైదరాబాద్ చేరుకుంది. మహిళ బ్యాగును అధికారులు తనిఖీ చేయగా... అనుమానాస్పదంగా ఉన్న పౌడర్ లభించింది. దానిని స్వాధీనం చేసుకుని... పరీక్షించగా హెరాయిన్‌గా తేలింది. మొత్తం 3.2 కిలోల హెరాయిన్ ఉన్నట్లు గుర్తించి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 21 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితురాలని అరెస్ట్ చేశారు. మహిళ నుంచి మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.