Loan app harassments: ఎవరికో రుణమిచ్చి, దాన్ని చెల్లించకుంటే కాల్‌గర్ల్ అని ప్రచారం చేస్తామని సంబంధం లేని మహిళను బెదిరించిన వ్యక్తులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు దిల్లీలో అరెస్టు చేశారు. ఈమేరకు బుధవారం నగర పోలీసులు తెలిపిన ప్రకారం.. రుణయాప్ సంస్థ వారు విశాఖకు చెందిన ఓ వ్యక్తికి రూ.4 వేలు, రూ.2500, రూ.2500 చొప్పున మూడుసార్లు రుణాలిచ్చారు. వాటిని అతను తిరిగి చెల్లించారు.
ఆయన అడగకముందే మరోసారి రూ.4 వేలు అతని ఖాతాలో వేయగా వాటిని అతను కట్టలేదు. అతని కాంటాక్టు లిస్టులో పేరున్నందుకు.. తమ వద్ద తీసుకున్న అప్పును పూర్తిగా చెల్లించాలని లేదంటే, రుణాలను ఎగ్గొట్టే వ్యక్తిగా పేర్కొంటూ బంధువులకు పోస్టులు పంపుతామని విశాఖకు చెందిన ఓ మహిళకు బెదిరింపు సందేశాలు పంపించారు. ఆమె ఫొటో కింద కాల్‌గర్ల్ అని రాసి, ఫోన్ నంబరు కూడా ఉంచి వాట్సప్ సందేశం చేశారు. భయపడిన బాధితురాలు ఆందోళనతో ఆత్మహత్యాయత్నం చేశారు. అనంతరం సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా సీఐ భవానీప్రసాద్ కేసు దర్యాప్తు ప్రారంభించారు.