విశాఖ ఆఫీషల్ కాలనీలో మూడేళ్ల క్రితం ఏర్పాటుచేసిన నేచర్స్ క్లబ్ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలు పెంచాలని మొదలైన ఈ సంస్థ.. ఈ ఏడాది దీపావళి పండగ వల్ల వచ్చే ధ్వని, వాయు కాలుష్య నివారణకు నడుం కట్టింది. కరోనా సమయంలో పీల్చే గాలి రసాయనాలు నిండితే శ్వాస కోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. కొవిడ్ వచ్చి తగ్గిన వారు ఈ గాలి పీలిస్తే ప్రాణాలకు ప్రమాదమని అంటున్నారు. అందుకే విశాఖ కలెక్టర్ కార్యాలయ సమీప ప్రాంతాలు ఎంపిక చేసుకుని రోజు సాయంత్రం సమయంలో నగర వాసులను బాణాసంచా వద్దని చైతన్య పరుస్తుంది నేచర్స్ క్లబ్.
బాణసంచాలో వాడే సల్ఫర్, బేరియం నైట్రేట్ రసాయనాలు చాలా ప్రమాదకరమని నేచర్స్ క్లబ్ సభ్యులు అంటున్నారు. గాలిలో నిలిచిపోయే ఈ రసాయనాలు ప్రజల శ్వాసవ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు.
నేచర్స్ క్లబ్ చేస్తున్న కార్యక్రమానికి గాజువాకకు చెందిన మరో స్వచ్ఛంద సంస్థ అడజస్ట్ ఫర్ సంస్థ తోడైంది. ఈ రెండు సంస్థలు దీపావళికి బాణసంచా కాల్చడం ఆపాలని ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. గతంలో హుద్ హుద్ సమయంలో నగరమంతా ఒక తాటి పైకి వచ్చి దీపావళి చేసుకోలేదని...మళ్ళీ ఇప్పుడు కరోనా సమయంలోనూ ప్రజలు ఐకమత్యంగా టపాసులు కాల్చకుండా దీపాలు వెలిగించి పండగ చేసుకోవాలని కోరుతున్నారు. అత్యధిక శబ్దం చేసే టపాసులు వేస్తేనే దీపావళి కాదని, పర్యావరణాన్ని కాపాడితే భవిష్యత్ తరాలకు మరిన్ని వెలుగులు పంచినవాళ్లు అవుతామని ఈ సంస్థలు చెబుతున్నాయి.