విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ(privatization of the Vizag steel plant) ప్రక్రియను అధికారికంగా ప్రారంభించేలా కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా లావాదేవీల సలహాదారు (ట్రాన్సాక్షన్ అడ్వయిజర్), న్యాయ సలహాదారుల (లీగల్ అడ్వయిజర్) నియామకానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అత్యంత క్లిష్టమైన ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా చిక్కులు రాకుండా ఉండేందుకు సలహాదారులు ఇచ్చే సూచనలు, సిఫార్సులు ఎంతో ముఖ్యం. కీలకమైన వీరి నియామకానికి టెండర్లు పిలవాల్సి ఉంది. అధికారులు అందుకు నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. టెండర్లో ముందు నిలిచిన వారికి ప్రైవేటీకరణ ప్రక్రియ బాధ్యతలను అప్పగిస్తారు. ఒకవైపు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్రంలో భాజపా మినహా ఇతర రాజకీయ పార్టీలు, కర్మాగార ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నా.. కేంద్రం ఇలా ముందడుగు వేయడంపై కార్మికుల్లో అసహనం వ్యక్తమవుతోంది.
ఆ భేటీ ఎందుకో..?
గతనెల 22న దిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ, దీపం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్‌మెంట్) విభాగం, విశాఖ ఉక్కు కర్మాగారం, ఇతర సంబంధిత విభాగాల నుంచి సుమారు 45 మంది కీలక అధికారులు భేటీ అయ్యారు. అధికారులు సమావేశ వివరాలను అధికారికంగా వెల్లడించకపోవడంతో ఉక్కు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి ఉక్కు పరిశ్రమ ఉన్నతాధికారులను సంప్రదించగా...ప్రైవేటీకరణ అంశాలేమీ తమ దృష్టికి రాలేదని తెలిపారు.