ఈతకొలనులో శిక్షణ... చిన్నారుల నుంచి భారీ స్పందన - children
ఒకప్పుడు వేసవి వస్తే గ్రామాల్లోని పిల్ల కాల్వల్లో ఆడుకునే పిల్లలు ఇప్పుడు నగరాల్లోని స్విమ్మింగ్ పూల్స్ లో సందడి చేస్తున్నారు. ఈత కొలనులో చేప పిల్లల్లా బుడతలు దూసుకుపోతున్నారు. విశాఖలోని డాల్ఫిన్ హోటల్ లో జరుగుతోన్న ఈత శిక్షణలో చిన్నారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు.
నీటిలో ఈతకొట్టడం వల్ల శారీరక ధృడత్వం, ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే ఈ వేసవిలో చాలా మంది తల్లిదండ్రులు... తమ పిల్లలకు ఈత నేర్పించడంపై దృష్టి సారించారు. విశాఖలోని డాల్ఫిన్ హోటల్లోని ఈత కొలనులో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. పెద్దసంఖ్యలో చిన్నారులు ఉదయం, సాయంత్రం ఈత నేర్చుకునేందుకు వస్తున్నారు.విశాఖలో జీవీఎంసీ, రైల్వేస్ సహా వివిధ సంస్థలు ఈతలో చిన్నారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించాయి. వేసవి తాపం నుంచి పిల్లలకు కాస్త ఉపశమనం దక్కినట్టు కూడా ఉంటుందనే ఆలోచనతో తల్లిదండ్రులు ఈత శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు.