ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉక్కు' ఉద్యమం: ప్రశాంతంగా రాష్ట్ర బంద్

రాష్ట్రవ్యాప్తంగా..విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదాలు హోరెత్తాయి. స్టీల్ ప్లాంటు కార్మికులకు సంఘీభావంగా..వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా..ప్రశాంతంగా నిరసనలు తెలిపారు.

ప్రశాంతంగా రాష్ట్ర బంద్
ప్రశాంతంగా రాష్ట్ర బంద్

By

Published : Mar 5, 2021, 8:47 PM IST

ప్రశాంతంగా రాష్ట్ర బంద్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..రాష్ట్ర బంద్ ప్రశాంతంగా సాగింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విశాఖ మద్దిలపాలెం కూడలిలో...వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. విజయసాయి కార్మికులు, కార్మిక నేతలతో అభిప్రాయాలను సేకరించారు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో..తెలుగుదేశం ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని గణబాబు విమర్శించారు. జగదాంబ కూడలిలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

విజయనగరం జిల్లాలోనూ..ప్రజాసంఘాలు, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. పార్వతీపురంలో తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. కాకినాడ సీ పోర్టు దగ్గర వామపక్షాలు, కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని..రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రతినిధులు విజయవాడలో అన్నారు. నష్టాలను సాకుగా చూపి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలనే కుట్ర జరుగుతోందంటూ..ఏపీఎన్జీవో సంఘం ర్యాలీ చేపట్టింది. గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేటలో..పార్టీలు, కార్మిక, విద్యార్థి సంఘాలు ర్యాలీ చేపట్టాయి. కైకలూరులో అఖిలపక్షం నిర్వహించిన ఆందోళనలో...వైకాపా, తెదేపా శ్రేణులు బాహాబాహీకి దిగాయి.

గుంటూరులో నిరసన చేపట్టిన తెలుగుదేశం నేతల్ని..పోలీసులు అరెస్ట్ చేసి అరండల్ పేట ఠాణాకు తరలించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా...రాజధాని గ్రామాల్లో అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. గుంటూరులో ర్యాలీ అనంతరం..శంకర్ విలాస్ కూడలిలో ఆటోలు, బస్సులను వామపక్షాలు అడ్డుకున్నాయి. టైర్లలో గాలి తీసేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు రోడ్డుపైనే బైఠాయించడంతో..బలవంతంగా స్టేషన్‌కు తరలించారు.

ప్రకాశం, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా..నిరసనలు వెల్లువెత్తాయి. నెల్లూరు ఇండియన్ బ్యాంక్‌లో విధుల్లో ఉన్న ఉద్యోగుల్ని.. నిరసనకారులు బయటికి పంపించారు. చిత్తూరు, కడప జిల్లాల్లో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ర్యాలీ చేపట్టాయి. అనంతపురం, గుత్తి, గుంతకల్, పామిడిలో..విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులకు మద్దతుగా నినాదాలు చేశారు.

ఇదీచదవండి

ప్రశాంతంగా విశాఖ ఉక్కు పరిరక్షణ బంద్‌

ABOUT THE AUTHOR

...view details