విశాఖ భూఆక్రమణలపై ప్రభుత్వం నియమించిన సిట్... వీఎంఆర్డీఏ థియేటర్ వేదికగా ఈ నెల 1 నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. విశాఖ గ్రామీణ, ఆనందపురం, భీమిలి, గాజువాక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. రికార్డుల మార్పులు, ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మిన దాఖలాలు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఇచ్చిన భూములు, సింహాచలం భూములు సహా... ప్రభుత్వ స్థలాల కబ్జాలపైనా అర్జీలు వచ్చాయి.
అటవీశాఖకు చెందిన 868 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు... డీఎఫ్వో సెల్వం ఫిర్యాదు చేశారు. కంబాలకొండ, నరవ, తీడా రిజర్వ్ ఫారెస్టుల పరిధిలో ఈ భూమి ఉందని... సంబంధిత రికార్డులు ట్యాంపరింగ్ జరిగి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధవధారలో 2 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాపై భాజపా మాజీ శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు చేశారు. అడవివరం, కప్పరాడల్లోనూ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం అయ్యాయంటూ.... తెలుగుదేశం నేతలు సిట్ దృష్టికి తీసుకొచ్చారు.