విశాఖ మెట్రో రైల్ డీపీఆర్‌ను త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కరోనా వల్ల ఆలస్యమైందని, త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు బదులిచ్చారు. పట్టణాలు, నగరాల్లోని ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి బొత్స, పురపాలకశాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
అమృత్ పథకం కింద రూ.3,762 కోట్లతో పనులు చేపట్టినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ పూచీకత్తుతో బ్యాంకుల నుంచి రూ.800 కోట్ల రుణం తీసుకోవాలని సీఎం సూచించారు. విజయవాడ, గుంటూరులో చేపట్టిన డ్రైనేజీలు సత్వరం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
విజయవాడ కాల్వల్లో చెత్త వేయకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖకు తాగునీటి సరఫరాపై కార్యాచరణ తయారుచేయాలని సీఎం ఆదేశించారు. విశాఖ, కాకినాడ, తిరుపతిలో రూ.4,578 కోట్ల విలువైన పనులు చేపట్టామన్న సీఎం... స్మార్ట్ సిటీ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జనాభా లక్ష దాటిన పట్టణాల్లో 10,666 కోట్ల రూపాయలతో డ్రైనేజీ పనులకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు.