ఆ తల్లి కష్టం చూస్తే.. కళ్లు చెమర్చాల్సిందే!
నవమాసాలు మోసిన ఆ తల్లి కడుపులోనే.. బిడ్డ మృతి చెందింది. మరో పక్క సకాలంలో వైద్యం అందకపోతే తన ప్రాణాలకే ముప్పని తెలిసిన ఆ బాలింత.. చికిత్స అందని దుర్భర పరిస్థితిలో ప్రత్యక్ష నరకం చూస్తోంది. కష్టపడి ఆసుపత్రికి వెళ్లినా.. ఎవరూ పట్టించుకునేవారు లేక.. బాధతో విలవిల్లాడుతోంది. విశాఖ మన్యంలో ఓ గర్భిణి పడిన ప్రసవవేదన కష్టాలు చూస్తే కళ్లు చెమర్చాల్సిందే.
విశాఖ మన్యంలో మరో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కడుపులో మృత శిశువును దాచుకుని గంటల పాటు ప్రసవ వేదనతో ఓ గర్భిణి నిరీక్షించింది. విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలానికి చెందిన ఆ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా.. కుటుంబీకులు స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కడుపులో ఉన్న బిడ్డ మృతి చెందింది. మృత శిశువును వెలికితీసేందుకు సరైన వైద్య సదుపాయాలు లేని కారణంగా.. విశాఖ కేజిహెచ్కు తరలించాలని వైద్యులు సూచించారు. తీరా తీసుకెళ్లాలనుకున్న సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవటం.. గంటల సమయం వేచి చూడాల్సి రావడం.. ఆ మహిళకు ప్రత్యక్ష నరకం చూపించింది. బాధితురాలి పరిస్థితి గురించి ఐటీడీఏ అధికారులకు తెలియజేసినా స్పందన కరవైంది. ఆరు గంటల పాటు మహిళా వార్డులో ఉంచి తరువాత వైజాగ్ కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లేసరికి వైద్యులు లేకపోవటం... ఆ అభాగ్యురాలి సమస్యను మరింత పెంచింది. నొప్పితో విలవిల్లాడిన బాధితురాలిని చూసి... బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఇన్ని అవాంతరాల అనంతరం.. చివరికి వైద్యులు చికిత్స అందించారు.