ఆంధ్ర వైద్య కళాశాల.. విభిన్న రాష్ట్రాల విద్యార్థులకు వేదిక! ఆంధ్ర వైద్య కళాశాల...వందేళ్ల చరిత్రకు చేరువవుతున్న వేళ దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. యూజీ-ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పరీక్షను తప్పనిసరి చేయడంతో... ఈ కళాశాల జాతీయ స్థాయిలో విద్యార్థులను సాదరంగా ఆహ్వానిస్తోంది. ఏఎంసీలో 250 యూజీ, 212 పీజీ సీట్లు ఉన్నాయి. నీట్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు ముందంజలో ఉన్నందున... జాతీయ కోటాలోనూ అధికంగా సీట్లు దక్కించుకుంటున్నారు. అందువల్ల యూజీ కోర్సుల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు దక్కుతున్న అవకాశాలు కాస్త తక్కువే. పీజీ కోర్సుల్లో మాత్రం... రెండేళ్ల వ్యవధిలో దాదాపు 50 మంది చేరడం విశేషం. బెంగళూరు, ముంబయి, దిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలు సహా... ఝార్ఖండ్, నాగాలాండ్, అసోం రాష్ట్రాల విద్యార్థులు...ఏఎంసీ వైపే మొగ్గు చూపుతున్నారు.
జాతీయ స్థాయి ర్యాంకు ఆధారంగానే..
ఏఎంసీలో సూపర్ స్పెషాలిటీ విభాగ సీట్లను... పూర్తిగా జాతీయ స్థాయి ర్యాంకు ఆధారంగా నింపాలి. ఫలితంగా ఇందులో ఇతర రాష్ట్రాల వారే అధికంగా ఉన్నారు. విశాఖ వాతావరణానికి త్వరగానే అలవాటు పడిన వీరంతా... పర్యటకానికి ఆటపట్టుగా ఉన్న సుందర నగరంతో ప్రేమలో పడిపోయారు. తెలుగు భాషనూ అలవోకగానే నేర్చుకుంటూ.... రోగులతో చక్కగా సంభాషిస్తున్నారు. వారి సాధక బాధకాలూ తెలుసుకుంటున్నారు. వైద్యకళాశాలకు చెందిన అన్ని స్పెషాలిటీ విభాగాల్లోనూ... ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చేదోడువాదోడుగా ఉంటున్నారు.
అనుకూల వాతావరణం కల్పించేందుకు కృషి: ప్రిన్సిపాల్
ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని ఏఎంసీ ప్రిన్సిపల్ సుధాకర్ చెప్పారు. సీట్ల సంఖ్య పెరిగినందున.... కళాశాలలో వసతి సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉందని తెలిపారు.
శత వసంతాలకు చేరువవుతున్న ఈ వైద్య కళాశాల....యువతరం వైద్యులను తయారు చేయడంలో అనుభవాన్ని రంగరిస్తోంది. భాష, ప్రాంత తారతమ్యాలు లేకుండా... అన్ని రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తోంది.
ఇదీ చదవండి : మెళకువలు నేర్చుకున్నాం.. ఇక రయ్యంటూ దూసుకెళ్తాం..