అద్దె ఆశ చూపాడు... కార్లతో ఉడాయించాడు
గిరిజన యువతకు ఆర్థిక భరోసా ఇచ్చే పథకాలు ఎన్ని ప్రవేశ పెట్టినా సరైన అవగాహన లేక లబ్ధిదారులు నష్టపోతూనే ఉన్నారు. అలాంటిదే ట్రైకార్ నిధులతో ఇచ్చిన వాహన పథకం. రాయితీపై వచ్చిన ఇన్నోవా, బొలెరో వాహనాలు సద్వినియోగం చేసుకోలేని గిరిపుత్రులు... మధ్యవర్తుల సాయంతో లీజుకిచ్చారు. ఇప్పుడు ఆ వాహనాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. నెలసరి వాయిదాలు కొట్టుకోలేక కొందరు తలలు పట్టుకుంటున్నారు. వాహనాల జాడ తెలియక లబోదిబోమంటున్నారు.
2018లో విశాఖ మన్యంలోని గిరిజన యువతకు ఎన్ఎస్టీఎఫ్డీసీ ట్రైకార్ నిధులు ఖర్చు పెట్టి 16.58 లక్షల రూపాయలతో ఇన్నోవా కార్లు ఇచ్చారు. 5.8 లక్షల రాయితీతో 9.95 లక్షలు నెలనెలా కట్టుకునేలా అందించారు. సుమారు 70 మంది లబ్ధిదారులు కార్లు అందుకున్నారు. విలువైన కారు అదనపు ఆదాయం సంపాదించవచ్చన్న మధ్యవర్తుల మాటలు నమ్మి విశాఖలో ఓ ట్రావెల్స్ సంస్థకు అప్పగించారు. పండు, ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నారు. విడతల వారీగా 40 వాహనాలు అద్దెకిచ్చేశారు. 2 నెలలు అద్దె ముట్టిన తర్వాతే కష్టాలు మొదలయ్యాయి. రావాల్సిన అద్దె రాలేదు. నెలసరి వాయిదాలు కట్టలేదని బ్యాంకులు నోటీసులు పంపించాయి. మధ్యవర్తులు మొహం చాటేశారు. ఈ దెబ్బతో బాధితులు తమ వాహనాల కోసం వెతుకులాట ప్రారంభించారు. కొందరి వాహనాలు అనకాపల్లి, అన్నవరంలో కనిపిస్తే తెచ్చుకున్నారు. వాహనాలు జిల్లాలే దాటిపోయాయి. నెంబర్ ప్లేట్లు మారిపోయాయి. ఇన్నోవాల్లో ఉండే జీపీఎస్ సెల్ అనుసంధాన పరికరాన్నీ తొలగించారు. మధ్యవర్తులను పట్టుకుని వాహనాలు కోసం వెళ్తే చంపేస్తామని బెదిరింపులూ ఎదుర్కొంటున్నారు బాధితులు. ఎమ్మెల్యే ఈశ్వరి కలుగుజేసుకొని మధ్యవర్తిని పిలిచి హెచ్చరించారు. ఇప్పుడు వారూ పరారీలో ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు. అద్దెకు ఇచ్చిన వాహనాలు ఆచూకీ తెలియక, ఇటు నెలసరి వాయిదా కట్టుకోలేక, సాక్షులతో మాట పడలేక నలిగిపోతున్నారీ గిరిపుత్రులు.