స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ పిలుపు మేరకు రాష్ట్రంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. విశాఖపట్నం మద్దిలపాలెం కూడలిలో నిర్వహించిన మానవహారంలో రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, పలువురు వైకాపా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మైక్ పట్టుకుని వ్యాఖ్యాత(యాంకర్)గా వ్యవహరించారు.
మానవహారంలో పాల్గొన్న వామపక్షాల నేతలతో పాటు పలువురితో.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడించారు. భాజపా, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ప్రజారవాణా స్తంభించింది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వలోని రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.