చేసేది స్వీపర్ ఉద్యోగం. కానీ బిల్డప్ మాత్రం సాప్ట్వేర్ ఉద్యోగిలా ఉంటుంది. అంతేకాదు ఏడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం. ఇప్పటివరకు ముగ్గురు మాత్రం బయటకు వచ్చి అతని వల్ల అన్యాయం జరిగిందని పోలీసుల ముందు లబోదిబోమన్నారు. మరికొందరు బాధితులు పరువు కోసం ఆలోచించి.. పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కడానికి భయపడుతున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా చొరవ తీసుకోవడంతో నిత్యపెళ్లికొడుకు అరుణ్ కుమార్ నేరాల చిట్టా బయటపడుతోంది.విశాఖ పోలీసులు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు వేగవంతం చేయడంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
అసలు ఏమైందంటే...
భార్య, కుమార్తెను, తనతో సహజీవనం చేస్తున్న మరో మహిళను వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెస్తున్న అరుణ్‌కుమార్‌ను విశాఖ నగరం కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండుకు తరలించారు. అతనిపై భార్య, మరో మహిళ చేసిన పలు ఆరోపణలను నిర్ధరించుకునేందుకు అతడిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. విశాఖ నగర డీసీపీ ఐశ్వర్య రస్తోగి ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరుణ్‌కుమార్‌పై కంచరపాలెం పోలీసులు 498ఎ, 506, 509, 323 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అరుణ్‌కుమార్‌తో సహజీవనం చేస్తున్న మహిళ.. తన భర్తను అతనే హత్య చేసినట్లు ఆరోపిస్తోంది. బాధితురాలి భర్త గతేడాది మార్చిలో ఒక బార్ వద్ద మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వైద్యుల నివేదికలో అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేలింది. మద్యం అధికంగా తీసుకోవడంతోనే అతను మరణించాడని నిర్దరించారు. ఆ అనుమానాస్పద మరణం వెనక మిస్టరీ ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. తన భర్త మరణించిన తరువాత.. అరుణ్‌కుమార్ ఆమెతో సహజీవనం చేస్తున్నది వాస్తవమేనని తేలింది.
నా కోసం నా భర్తను చంపానన్నాడు..
అరుణ్ కుమార్ నా భర్తతో సన్నిహితంగా ఉండేవాడు... నన్ను చెల్లి అని పిలిచేవాడు. నా భర్త రాము 2019లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆ తరువాత అరుణ్‌కుమార్ వచ్చి నా భర్తను తన కోసమే చంపానని చెప్పాడు. సహజీవనం చేయకపోతే పిల్లలిద్దరినీ చంపేస్తానని బెదిరించి కాపురం చేస్తున్నాడు. దీంతో అరుణ్ కుమార్ భార్య, నేను కొన్నాళ్లుగా ఒకే ఇంటిలో ఉంటున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అరుణ్‌కుమార్.. అతని భార్యను, నన్ను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడు.. నిరాకరించడంతో బాగా కొట్టాడు. విసిగిపోయి గత నెలలో పోలీసు కమిషనర్‌కు వాయిస్ మేసేజ్ ద్వారా ఫిర్యాదు చేశాం. కేసును కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. - బాధితురాలు
అప్పటికే ఓసారి జైలుకు వెళ్లి వచ్చాడు..