ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ కేజీహెచ్​లో రోగుల అవస్థలు.. వైద్యమందక చిన్నారి మృతి

సకాలంలో వైద్యమందక విశాఖ కేజీహెచ్‌ కొవిడ్‌ వార్డులో ఓ చిన్నారి కన్నుమూసింది. మరో సంఘటనలో ఇక్కడే కొవిడ్‌ బాధితుడు ఒకరు భవనం పైనుంచి పడి చనిపోయారు. ఈ హృదయ విదారక దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి.

విశాఖ కేజీహెచ్​లో వైద్యమందక.. బలైపోయిన చిన్నారి ప్రాణాలు
విశాఖ కేజీహెచ్​లో వైద్యమందక.. బలైపోయిన చిన్నారి ప్రాణాలు

By

Published : Apr 28, 2021, 7:29 AM IST

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చౌడపల్లి గ్రామానికి చెందిన సీఐఎస్‌ఎఫ్‌ ఉద్యోగి వీరబాబు కుమార్తె చార్విత (15నెలలు) కొవిడ్‌తో అస్వస్థతకు గురైంది. తొలుత అచ్యుతాపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. అయినా ఆరోగ్యం మెరుగుపడనందున మంగళవారం విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిటీస్కాన్‌లో లక్షణాలు కన్పించాయి. తదుపరి చికిత్స కోసం సాయంత్రం కేజీహెచ్‌కు రాగా గంటన్నర నిరీక్షణ అనంతరం చేర్చుకున్నారని తండ్రి వీరబాబు వివరించారు. పరిస్థితి విషమించి పసిపాప చనిపోయింది. అంబులెన్సులో ఆక్సిజన్‌పై ఉంచిన చిన్నారిని కొవిడ్‌ ఆసుపత్రి వైద్యులు వెంటనే చేర్చుకోలేదని తండ్రి రోదించారు. వచ్చిన వెంటనే చేర్చుకొని వైద్యం ప్రారంభించామని, అప్పటికే పాప పరిస్థితి విషమించిందని కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారిణి పి.మైథిలి తెలిపారు.

  • కేజీహెచ్‌ కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతున్న అమ్మలకంటి వెంకటరావు(41) వార్డు నాలుగో అంతస్తు నుంచి కాలుజారి కిందపడి చనిపోయారు. 13రోజుల క్రితం ఇదే వార్డులో ఓ బాధితురాలు దూకి ఆత్మహత్య చేసుకుంది.

నిండు గర్భిణి మృత్యువాత

మరో నెలలో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన గర్భిణి మృత్యుఒడికి చేరుకున్నారు. విజయనగరానికి చెందిన తారకేశ్వరరావు, పార్వతి(33)లు గాజువాకలో నివసిస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పార్వతి ప్రస్తుతం 8 నెలల గర్భిణి. కరోనా లక్షణాలతో బాధపడుతూ ఇంట్లోనే మందులు వాడుతున్నారు. ఈ నెల 23న గొంతులో మంట, శ్వాస సంబంధ సమస్యలు రావడంతో అగనంపూడిలోని సీహెచ్‌సీలో చేర్పించారు. పాజిటివ్‌గా తేలడంతో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు.

ఇదీ చదవండి:వ్యాక్సినేషన్ ప్రకియలో గందరగోళం.. తెల్లవారుజాము నుంచే ప్రజల బారులు

ABOUT THE AUTHOR

...view details