భాజపా ప్రాథమిక సభ్యత్వానికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు రాజీనామా లేఖను అందించారు. ఈ సందర్భంగా కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. తనను మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా నియమించటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి మోదీ,హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా మిజోరాం ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పారు.
'రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు రాజకీయాలకు దూరంగా ఉండాలి. అందుకే భాజపా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. 30 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించాను. పార్టీని విడుతున్నందుకు బాధగా ఉంది.'- కంభంపాటి హరిబాబు, మిజోరాం నూతన గవర్నర్
ఆనందంగా ఉంది: సోము వీర్రాజు
కంభంపాటి హరిబాబుని గవర్నర్గా నియమించటం ఆనందంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆంధ్ర ఉద్యమంలో కంభంపాటి ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. నవ్యాంధ్రలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారని.. కీలక పదవులను సమర్థంగా నిర్వర్తించారని ప్రశంసించారు.