ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ngt on laterite excavations: లేటరైట్‌ తవ్వకాలపై వాస్తవాలు తేల్చండి

By

Published : Jul 30, 2021, 3:13 PM IST

Updated : Jul 31, 2021, 6:49 AM IST

విశాఖ మన్యంలో లేటరైట్ తవ్వకాలపై విచారణ కమిటీ ఏర్పాటు
Inquiry Committee on Bauxite Mining at Visakhapatnam

15:08 July 30

విశాఖ మన్యంలో లాటరైట్ తవ్వకాలపై విచారణ కమిటీ ఏర్పాటు

అనుమతుల్లేకుండా లేటరైట్‌ తవ్వకాలు చేపట్టడం, అటవీ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై వాస్తవాలు తేల్చాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) సంయుక్త నిపుణుల కమిటీని ఆదేశించింది. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం బమిడికలొద్ది అటవీ భూముల్లో అక్రమంగా చేపట్టిన లేటరైట్‌ తవ్వకాలపై విచారణ జరిపించాలని కోండ్రు మరిడియ్య ఎన్జీటీ చెన్నై బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌పై జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, విషయ నిపుణుడు సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అటవీ శాఖ అనుమతులు తీసుకోకుండానే బమిడికలొద్దిలో లేటరైట్‌ తవ్వకాలు చేపట్టడంతోపాటు గిరిజనుల కోసం వేసిన రహదారిని నిబంధనలకు విరుద్ధంగా విస్తరించారని పిటిషనర్‌ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. 

  ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఎన్జీటీ అయిదుగురు సభ్యులతో సంయుక్త నిపుణుల కమిటీని నియమించింది. కమిటీకి ఏపీ పీసీబీ అధికారి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని, ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి... తవ్వకాలు, అనుమతులు, పర్యావరణానికి వాటిల్లుతున్న నష్టం, నిబంధనల ఉల్లంఘన, రహదారి విస్తరణ, నిబంధనలు ఉల్లంఘిస్తే తీసుకోవాల్సిన చర్యలు, చెల్లించాల్సిన పర్యావరణ పరిహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. అదే సమయంలో అటవీ అనుమతులు, గిరిజనుల హక్కులను ఉల్లంఘించారా అనే అంశంపైనా రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన సంరక్షకుడు, అటవీ భద్రత బలగాల ముఖ్య అధికారి తమ నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. అన్ని నివేదికలనూ ఆగస్టు 31లోపు సమర్పించాలని, తదుపరి విచారణను ఆగస్టు 31న చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది.

ఇదీ చదవండి

RRR: ఆగస్టు 25న తప్పకుండా న్యాయం జరుగుతుంది: రఘురామరాజు

Last Updated : Jul 31, 2021, 6:49 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details