Minister Dharmana prasadaraor:చూశారుగా.. ధర్మాన గారి వీరావేశం. ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వెళ్లిపోతారట. ఉత్తరాంధ్రపై ప్రేమతో ఇదంతా చేసినట్లు కనిపిస్తున్నా... అసలు విషయం మాత్రం వేరే ఉంది. ఉన్నఫళంగా విశాఖ రాజధాని అయితే... గతంలో తాను అక్రమంగా పోగేసిన భూముల విలువను భారీగా పెంచుకోవచ్చని ఆయన ఆశ పడుతున్నారు. ధర్మాన మాటల్లోని మర్మమిదే.
అత్యంత కీలకమైన రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు... ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలోనూ అవే బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో యంత్రాంగంపై అధికారం చలాయించి... విశాఖ శివార్లలో వందల కోట్ల విలువైన భూములు సొంతం చేసుకున్నారు. మాజీ సైనిక ఉద్యోగుల పేరుతో విశాఖ చుట్టుపక్కల ప్రభుత్వం ఇచ్చిన డీఫాం పట్టా భూములు అమ్ముకునేందుకు వీలుగా... నిరభ్యంతర పత్రాలు జారీ చేయించారు. అనంతరం ఆ భూములన్నీ తన కుటుంబసభ్యులు, స్నేహితులు, వారి కంపెనీల పేరిట రిజిస్టర్ చేయించేశారు. విశాఖ గ్రామీణ, పరవాడ, మధురవాడ మండలాల్లో ఏకంగా 71.29 ఎకరాలను ధర్మాన ఈ విధంగా గుప్పిట పట్టినట్లు.. విశాఖ భూకుంభకోణాలపై గత ప్రభుత్వ హయాంలో నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ తేల్చిచెప్పింది.
ఈ కుంభకోణాల్లో ధర్మాన ప్రసాదరావే సూత్రధారి, పాత్రధారి అని నిర్ధరించిన సిట్ నివేదిక... ఈనాడు-ఈటీవీ- ఈటీవీ భారత్‌కి అందింది. ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉండటం వల్లే ఈ అనుమతులు వచ్చాయని.. సామాన్యులకు ఇలా ఎన్ఓసీలు దక్కే అవకాశమే లేదని కూడా స్పష్టంచేసింది. ఈ వ్యవహారంలో ధర్మాన పాత్రపై మరింత లోతైన దర్యాప్తు జరగాలని సిఫార్సు చేసింది. అలాగే ఈ కుంభకోణంలో భాగమైన అధికారులు, రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేశారని సిట్ స్పష్టంచేసింది. కొన్ని కేసుల్లో డీఫాం భూముల కేటాయింపు తీరూ ప్రశ్నార్థకమైంది. నిజంగా వారు మాజీ సైనికోద్యోగులా.? కాదా.? అసలు ఎప్పుడు వారికి భూములు కేటాయించారనే విషయాల్లో వచ్చిన అనుమానలకు సమాధానాలు దొరకలేదు. మాజీ సైనిక ఉద్యోగులుగా భూములు విక్రయించిన కొందరు.. విచారణ సమయంలో ఎక్కడున్నారో కూడా సిట్ గుర్తించలేకపోయింది.
విశాఖ రూరల్ మండల అటవీ, రెవెన్యూ భూముల్లో అనేక అక్రమాలు జరిగాయని, రికార్డులు ట్యాంపరింగ్ చేశారని, 2017 మే నెలలో బయటికొచ్చింది. భూఅక్రమాలపై 2015లోనే అప్పటి విశాఖ తహసీల్దార్ సుధాకర్‌నాయుడు.. కలెక్టర్‌కు ఓ నివేదిక సమర్పించినట్లు తేలింది. 2015కు ముందు వివిధ రెవెన్యూ కార్యాలయాల పరిధిలో జరిగిన అక్రమాలు, రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్‌పై ఉన్నతాధికారులకు కొందరు అధికారులు ముందే తెలియజేసినట్లు నిర్ధరణ అయింది. ఈ పరిస్థితుల్లో ఆనాటి గ్రేహౌండ్స్ డీఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ ఆధ్వర్యాన.. విశాఖ జేసీ జి.సృజన, డిప్యూటీ కలెక్టర్ లంకా విజయసారథి సభ్యులుగా 2017 జూన్ 20న ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసింది. విశాఖ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వందల కోట్ల విలువైన భూములకు సంబంధించిన అక్రమాలను వెలికితీసిన సిట్, అప్పటి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పటికీ వెలుగుచూడని ఆ నివేదిక.. తాజాగా ఈనాడు- ఈటీవీ- ఈటీవీ భారత్ చేతికి చిక్కింది. అప్పటి, ఇప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు పాత్రను.. సిట్ నివేదికలో కీలకంగా ప్రస్తావించింది. ఈ నివేదిక రాజకీయ ప్రేరేపితం అనుకోవడానికీ లేదని, అదే ఉద్దేశమైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ధర్మానపై చర్యలు తీసుకునే వారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మాజీ సైనికులు, రాజకీయ బాధితుల పేరుతో పట్టాలు సృష్టించి రికార్డులు తారుమారు చేసిన ధర్మాన.. వాటికి నిరభ్యంతర పత్రాలు పొందారు. ఆ తర్వాత తన కుటుంబసభ్యులు, సన్నిహితుల పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొన్ని కేసుల్లో డీఫాం భూములు పొందినవారు మాజీ సైనిక ఉద్యోగులు, అధికారులే అయినా.. వారికి ఆ విధంగా భూమి పొందే అర్హత లేదని విచారణలో వెలుగుచేసింది. వారి నుంచి భూములు చేతులు మారి, మంత్రి కుటుంబీకులకు చేరినా... అసలు వ్యక్తులు ఎక్కడున్నారో సిట్ కనుక్కోలేకపోయింది. ఈ భూముల దందాలో రికార్డులు మార్చడం ఒక ఎత్తయితే, కొన్ని కేసుల్లో రికార్డులను కూడా గుర్తించలేకపోయారు. కొన్ని భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్ అనుమతులు లభించిన సమయంలో... ధర్మాన ప్రసాదరావే రెవెన్యూ మంత్రిగా ఉన్నారని కూడా సిట్ నివేదికలో పేర్కొంది. ఈ భూములను పొందిన పేదలు లేదా మాజీ సైనిక ఉద్యోగులు వాటిని అమ్ముకోవాలన్నా, వారి నుంచి ఎవరైనా కొనాలన్నా... జిల్లా కలెక్టర్ నిరభ్యంతర పత్రాలు జారీ చేయాలి. సరైన తనిఖీలు, పరిశీలన లేకుండానే ఈ భూముల క్రయవిక్రయాలకు అప్పటి విశాఖ జిల్లా అధికారులుఎన్ఓసీలు ఇచ్చేశారని సిట్ తేల్చింది. ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉండటం వల్లే ఇదంతా జరిగిందని నిర్ధరించింది. ఈ వ్యవహారంలో అప్పటి కలెక్టర్లు లవ్ అగర్వాల్, జె.శ్యామలరావుతో పాటు సంయుక్త కలెక్టర్ల పాత్రనూ తప్పుబట్టింది.
మాజీ సైనిక ఉద్యోగులుగా పేర్కొంటూ విశాఖ రూరల్, పరవాడ మండలాల్లో ప్రభుత్వం నుంచి కొందరు పొందిన 71.29 ఎకరాల డీఫాం భూముల్నని.. మంత్రి ధర్మాన కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు చేజిక్కుంచుకున్నట్లు సిట్ తేల్చింది. ఇందుకోసం ధర్మాన హయాంలోనే 20 నిరభ్యంతర పత్రాలు జారీ అయ్యాయి. భూయజమానుల నుంచి ధర్మాన భార్య లక్ష్మి, కుమారుడు రామమనోహర్ నాయుడు, సోదరుడు ధర్మాన రామదాస్‌తో పాటు స్నేహితులు, బంధువుల పేరిట మారిపోయాయి. కోరమాండల్ ఎస్టేట్స్ అండ్ ప్రాపర్టీస్ కంపెనీలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన రామదాస్ డైరెక్టర్. మరో డైరెక్టర్ ఐ.బీ కుమార్ ధర్మానకు అత్యంత సన్నిహితుడు. ఓంకాన్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ కంపెనీలోనూ ధర్మాన రామదాస్ డైరెక్టర్. ఈ సంస్థ పేరిట కొన్ని భూములు రిజిస్ట్రేషన్ చేశారు. రెండు కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా ఉన్న రామదాస్ పేరిట కొన్ని భూములు నేరుగా కొన్నారు.