"విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ... భూమి ఇచ్చేందుకు సీఎం హామీ" - shuttle
భవిష్యత్తులో క్రీడల్లో మరింతగా రాణించేందుకు సీఎం జగన్ అండగా ఉంటామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు విశాఖలో 5 ఎకరాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు: పీవీ సింధు
విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు 5 ఎకరాలను కేటాయించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు బ్యాడ్మింటన్ క్రీడాకారాణి పీవీ సింధుకు హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు, పీవీ రమణ, విజయ, క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, క్రీడా సంఘాల ప్రతినిధి చాముండేశ్వరీనాథ్, శాప్ అధికారులతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను, సచివాలయంలో సీఎం జగన్‌ను పీవీ సింధు శుక్రవారం వేర్వేరుగా కలిశారు. వారు ఆమెను ఘనంగా సత్కరించారు. సింధు తెలుగు రాష్ట్రాలకే కాక దేశానికే గర్వకారణమని గవర్నర్ అన్నారు. అనంతరం విలేకరులతో సింధు మాట్లాడారు. గవర్నర్, సీఎం తనను అభినందించటం సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో క్రీడల్లో మరింతగా రాణించేందుకు సీఎం జగన్ అండగా ఉంటామన్నారని సింధు పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు విశాఖలో 5 ఎకరాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని సింధు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారానికి తన పేరును కేంద్రం నామినేట్ చేసిన విషయంపై తనకింకా అధికారిక సమాచారం రాలేదని వెల్లడించారు.