విశాఖలో కలకలం రేపిన భూ బెదిరింపు ముఠాల వ్యవహరానికి సంబంధించి... మరో వర్గం స్పందించింది. తాము భూబెదిరింపు ముఠా కాదని... తమకు రావాల్సిన భూమి కోసం పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ఈ విషయం మీడియాలో రావడం... పులివెందుల ముఠాలు విశాఖలో తిష్ట వేశాయని పారిశ్రామికవేత్త నరేష్కుమార్ చెప్పడంతో విషయం పెద్దదయ్యింది. పారిశ్రామికవేత్త నరేష్కుమార్ ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో... సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వారి తరపున కృష్ణమోహన్ అనే వ్యక్తి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు.
విశాఖ మర్రిపాలెంలోని సర్వే నెంబర్ 81/2, 81/3లో ఉన్న 6.8 ఎకరాలు ఎల్లపు నాగేశ్వరావు ఎల్లపు ఈశ్వరావుకు చెందినదిగా... ఆ భూమిని నరేష్కుమార్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని 2013లో తనను కొందరు ఆశ్రయించినట్లు కృష్ణమోహన్ తెలిపారు. 2013 నుంచి దీనిపై వివాదం కొనసాగుతోందని... దీనిని పరిష్కరించుకోనేందుకు నరేష్కుమార్ స్నేహితుడైన మరో పారిశ్రామికవేత్తతో మాట్లాడినట్లు వివరించారు. అందుకే వెళ్లారని... వెళ్లిన వారిలో హైదరాబాద్ నుంచి వచ్చిన రామిరెడ్డి, నాగిరెడ్డి, రామాంజనేయులు, పారిశ్రామిక వేత్త సాంబశివరావులు ఉన్నారని తెలిపారు.