నేటి నుంచి బీచ్ వాలీబాల్ పోటీలు
ప్రపంచ టూర్ బీచ్ వాలీబాల్ టోర్నీకి అతిథ్యం ఇవ్వనున్న తొలి భారత నగరంగా విశాఖపట్నం రికార్డు సాధించనుంది.
విశాఖ సాగర తీరం అంతర్జాతీయ క్రీడా సంబరానికి సిద్ధమైంది. నాలుగు రోజుల పాటు ఇసుక తిన్నెలపై వాలీబాల్ క్రీడ అలరించనుంది. 20కి పైగా దేశాలు... 50కి పైగా టీమ్లు తలపడనున్నాయి. దేశంలోనే తొలి సారిగా జరుగుతున్న ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సర్వం సిద్ధం
విశాఖ ఆర్కే బీచ్ అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలకు వేదికగా నిలిచింది. నేటి నుంచి మార్చి 3 వరకు వివిధ దేశాల నుంచి వచ్చిన వాలీబాట్ జట్లు.. పోటీ పడనున్నాయి. ఇసుక తిన్నెలపై వాలీబాల్ పోటీల నిర్వహణకు ప్రత్యేకంగా నాలుగు కోర్టులను అభివృద్ధి చేశారు. మూడు రోజులుగా వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ఇక్కడ సాధన చేస్తున్నారు. ప్రత్యేకంగా ఫ్లడ్ లైట్లను అమర్చి రాత్రి సమయంలోను పోటీలు జరిపేందుకు అనువుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
విశాఖ నగరంలో ఈ తరహా అంతర్జాతీయ పోటీలను నిర్వహించడంపై వివిధ రాష్ట్రాల క్రీడాకారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాలీబాల్ క్రీడను మరింత ప్రోత్సహించడానికి ఈ పోటీలు దోహదం చేస్తాయంటున్నారు.
విశాఖ బీచ్ కు క్రీడా రంగంలోనూ అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని తీసుకురానున్న పోటీలను నగర ప్రజలు ప్రోత్సహించాలని స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కోరారు.
బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన విదేశీయులతో విశాఖ సాగర తీరం సందడిగా మారింది. సాగరతీరంలో వాలీబాల్ సాధన ప్రజలను ఆకట్టుకుంది. భాజపా ఎమ్మేల్యేలు విష్ణుకుమార్ రాజు, మాణిక్యాలరావు, తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి... ప్రాక్టిస్ మ్యాచ్లుతిలకించారు.