ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 2, 2019, 5:01 PM IST

ETV Bharat / city

ప్రముఖ సామాజిక వేత్త అంకితం ఇంద్రాణి జగ్గారావు కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త, మిసెస్‌ ఏవీఎన్‌ కళాశాల ఛైర్‌పర్సన్‌ అంకితం ఇంద్రాణి జగ్గారావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంతో మంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విద్యార్థులను అందించిన మిసెస్‌ ఏవీఎన్‌ కళాశాలకు 25 ఏళ్ల పాటు ఈమె కరస్పాండెంట్‌గా వ్యవహరించారు. విద్యాభివృద్ధికి, మహిళా అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేశారు.

avn college  chairperson ankitham indrani dead
అంకితం ఇంద్రాణి జగ్గారావు(పాతచిత్రం)

మిసెస్‌ ఏవీఎన్‌ కళాశాల మాజీ కరస్పాండెంట్‌, ప్రస్తుత ఛైర్‌పర్సన్‌ అంకితం ఇంద్రాణి జగ్గారావు(85) కన్ను మూశారు. విశాఖలోని వాల్తేరు అప్‌ల్యాండ్స్‌ దీపాంజలి ఆపార్టుమెంట్‌లోని ఆమె స్వగృహంలో ఆదివారం ఆమె తుది శ్వాస విడిచారు. విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసి బాటలు వేసిన ఈమె... మహిళల సమస్యలపైనా అలుపెరగని పోరాటం చేశారు. సాంఘిక దురాచారాలపై ఉక్కుపాదం మోపేందుకు అహోరాత్రులు శ్రమించారు. దేశ ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఘనత ఈమె సొంతం.

ఏవీఎన్‌ కళాశాల అభివృద్ధికి విశేష కృషి

1934 సెప్టెంబరు 24న పశ్చిమబంగాల్​ రాష్ట్రంలో సంపన్న కుటుంబంలో ఇంద్రాణి జన్మించారు. ఈమె తండ్రి సమరేంద్ర గుప్తా డిప్యూటీ ఆడిటర్‌ జనరల్‌గా దేశానికి సేవలందించారు. దిల్లీ యూనివర్శిటీ నుంచి ఈమె ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పట్టా పొందారు. విశాఖ నగరంలో పేరు గాంచిన అంకితం కుటుంబానికి చెందిన ఏవీఎన్‌ జగ్గారావును వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు కుమారులు. సర్‌ సీవీ రామన్‌, కొంగర జగ్గయ్య, ఎస్‌వీ రంగారావు వంటి మహానుభావులను అందించిన ఏవీఎన్‌ కళాశాల అభివృద్ధిలో ఈమె పాత్ర మరువలేనిది. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ఉన్న సంప్రదాయ కోర్సుల స్థానంలో సాంకేతిక కోర్సులు ప్రవేశపెట్టారు. 1964లో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీలో చేరినప్పటి నుంచి ఆమె సంఘ సేవకురాలిగా, మహిళాభ్యుదయవాదిగా, సంఘ సంస్కర్తగా సేవలు ప్రారంభించారు.

● వయోజన విద్య కోసం ముఖ్యంగా గ్రామీణ మహిళల అక్షరాస్యత కోసం విశేష కృషి చేశారు. వందలాది రాత్రి శిబిరాలు ఏర్పాటు చేసి విద్యను అందించారు.

● అఖిల భారత మహిళా సంఘం అధ్యక్షురాలిగా, మహిళా దక్షత కమిటీ అధ్యక్షురాలిగా, ఉమ్మడి రాష్ట్ర హస్త కళల సలహా సంఘ సభ్యురాలిగా, కేజీహెచ్‌ సలహా మండలి సభ్యురాలిగా సేవలందించారు.

● ఎయిడ్స్‌ నివారణకు తన వంతు కృషి చేశారు. వరకట్నం, లైంగిక వేధింపులు, మహిళలపై దురాగతాలను అడ్డుకునేందుకు పాటు పడ్డారు.

● విశాఖ జిల్లాలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో పరివికా మహిళా లోక్‌ అదాలత్‌తో న్యాయసేవలు అందించారు. విశాఖ వేలీ పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యురాలిగానూ సేవలందించారు.

● ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ సభ్యురాలిగా సంస్కృతి, వారసత్వ భవనాల సంరక్షణకు ఈమె కృషి చేశారు.

ఎన్నో అవార్డులు కైవసం

ఇంద్రాణి సేవలను గుర్తించి అనేక సంస్థలు అవార్డులు ప్రకటించాయి. 1994 సంవత్సరంలో వైశాఖి పురస్కారాన్ని అందుకున్నారు. 1997 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. అదే సంవత్సరంలో కేంద్ర మహిళా కమిషన్‌ ఈమె సేవలను గుర్తించి ఉమెన్‌ ఎక్స్‌లెన్సీ అవార్డును ప్రకటించగా అప్పటి ప్రధాన మంత్రి దేవెగౌడ చేతుల మీదుగా అందుకున్నారు. ఈమె అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం లాసన్స్‌బే కాలనీ శ్మశాన వాటికలో జరిగాయి.

ఇదీ చూడండి:

'ఇంత విచిత్రమైన నాయకుడిని ఎప్పుడూ చూడలేదు'

ABOUT THE AUTHOR

...view details