రాష్ట్రంలో వరుస పారిశ్రామిక ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. స్టైరీన్ గ్యాస్ ప్రమాద ఘటన అనంతరం ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం పరిశ్రమల తనిఖీకి ఆదేశాలు జారీ చేసింది. పారిశ్రామిక భద్రత అత్యవసరం అని పేర్కొంటూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్ ఉత్తర్వులు ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమలపై ప్రత్యేక డ్రైవ్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయిలో పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా మరో ఆరుగురు సభ్యులతో కమిటీ నియమించారు. ఎలాంటి జాగ్రత్తలు అయినా 30 రోజులలోపే తీసుకునేలా చూడాలని కమిటీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. వివిధ రసాయనిక పరిశ్రమలు, ప్రమాదకర కెమికల్స్, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇలా అన్నిటినీ తనిఖీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రతి పరిశ్రమలోనూ తనిఖీ ప్రధాన ఉద్దేశం అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 90 రోజుల్లో ఈ స్పెషల్ డ్రైవ్ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.