ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆస్తుల నివేదికను అధిష్టానం ఆదేశాల మేరకు.. పరిశీలిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్ధతిస్తుందని రుద్రరాజు అన్నారు. పార్లమెంట్లో చర్చ జరగకుండా, రాజ్యసభలో బలం లేకుండానే.. మూడు నల్ల చట్టాలను దొడ్డిదారిలో ఆమోదించారని పేర్కొన్నారు.
'విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం దుర్మార్గపు చర్య' - వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్ధతిస్తుంది న్యూస్
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఆస్తులన్నింటినీ పరిశీలించి అధిష్టానానికి నివేదిక సమర్పిస్తామని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో రుద్రరాజు పేర్కొన్నారు.
భారత రైతులను వ్యవసాయ కూలీలుగా మార్చేసి.. కార్పొరేట్ వ్యాపారులకు రైతుల ఆస్తులను దోచిపెట్టే విధంగా బిల్లులను తయారు చేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా.. మూడు నల్ల బిల్లులను వెనక్కు తీసుకునేంత వరకు కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్నీ గుర్తుచేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం దుర్మార్గపు చర్యగా రుద్రరాజు అభివర్ణించారు. కాంగ్రెస్ పాలనలో స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.