ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ వధువు మృతికేసులో ఊహించని ట్విస్ట్.. పోలీసులు ఏమన్నారంటే? - Bride death case in VIsakha

Twist in Bride death
Twist in Bride death

By

Published : May 12, 2022, 4:15 PM IST

Updated : May 12, 2022, 8:00 PM IST

16:13 May 12

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు..

విశాఖ వధువు మృతికేసు.. పోలీసులు ఏమన్నారంటే?

Bride death case: విశాఖ మధురవాడలో పెళ్లిపీటలపై కుప్పకూలి వధువు చనిపోయిన ఘటన కీలక మలుపు తిరిగింది. తొలుత సాధారణ మరణంగానే భావించినా.. ఆ తర్వాత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలియనున్నాయి.

మధురవాడలో బుధవారం రాత్రి వివాహం జరుగుతుండగా పెళ్లిపీటలపై ఒక్కసారిగా వధువు కుప్పకూలి చనిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. పెళ్లికుమార్తె ఎందుకు చనిపోయిందో ఎవరికీ అంతుచిక్కలేదు. సాధారణ మరణమే అయ్యుంటుందని మొదట అంతా భావించారు. కానీ ఆసుపత్రికి తరలించి వైద్యులు పరిశీలించాక.. విషయం మరో మలుపు తీసుకుంది.

విషపూరిత పదార్థం సేవించడం వల్లే పెళ్లి కుమార్తె సృజన చనిపోయిందని వైద్యులు చెప్పినట్లు మధురవాడ సీఐ రవికుమార్‌ చెప్పారు. ఈమేరకు కేసు నమోదుచేసిన పోలీసులు అసలు కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏం జరిగిందంటే? :సృజన వివాహానికి మధురవాడ నగరంపాలెంలో భారీ ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి అట్టహాసంగా వివాహ వేడుక నిర్వహిస్తున్నారు. పండితుల వేదమంత్రోచ్ఛారణ మధ్య జీలకర్ర బెల్లం కార్యక్రమం నిర్వహిస్తుండగా... ఒక్కసారిగా వధువు సృజన ఉన్నట్టుండి పెళ్లి పీటలపైనే కుప్పకూలింది. ఈ అనూహ్య పరిణామంతో కుటుంబ సభ్యులతోపాటు పెళ్లి మండపంలోని వారంతా షాక్‌ అయ్యారు. వెంటనే తేరుకున్న కుటుంబసభ్యులు ఆమెకు సపర్యలు చేశారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. రాత్రి నుంచి చికిత్స అందించగా.. ఈ ఉదయం ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.

హఠాన్మరణం పై తొలుత సాధారణంగా భావించినా, మృతి సమాచారం పోలీసులకు ఇచ్చిన ఆసుపత్రి వైద్యులు విషాహారం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేయడంతో.. మృతదేహాన్ని కేజీహెచ్ కి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. రెండు రోజులుగా పెళ్లికుమార్తె అలసటకు గురై నీరసించిందని అనుకున్నామని, కానీ ప్రాణం కోల్పోతుందని భావించిలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో మాకు సమాచారం వచ్చింది. ఉదయం 8.55 గంటల సమయంలో సృజన చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. వైద్యులు చెప్పిన మేరకు ఆమె విష పదార్థం స్వీకరించినట్టుగా తెలుస్తోంది. సృజన బ్యాగ్ లో కూడా గన్నేరు పప్పు ఆనవాళ్లు ఉన్నాయి. వాటిని సేకరించి పరీక్షకు పంపాము. రేపు ఉదయం పోస్టుమార్టం జరుగుతుంది. ఇప్పటివరకు ఎటువంటి మాకు ఆత్మహత్య లేఖా లభ్యం కాలేదు. - ఏసీపీ శ్రీనివాసరావు, మధురవాడ

ఇవీ చదవండి :

Last Updated : May 12, 2022, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details