పెట్రోలు, డీజిల్ ధరల్ని తగ్గించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదని.. వాటిపై సెస్సుల రూపంలో లక్షల కోట్లు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వమే మరింత తగ్గించాలని మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. భాజపా నాయకులకు నిజాయతీ, నిబద్ధత ఉంటే లీటరుపై రూ.5, రూ.10 కాకుండా మరో రూ.25 తగ్గించాలని ప్రధాని మోదీని అడగాలని, అందుకోసం దిల్లీలోని నార్త్ బ్లాక్, పార్లమెంటు ముందు ధర్నా చేయాలని పేర్ని నాని సవాల్ విసిరారు. కావాలంటే తాను కూడా వస్తానన్నారు.
వైకాపా కేంద్ర కార్యాలయంలో నాని సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ‘రూ.70 ఉండే డీజిల్, పెట్రోలు ధరలను రూ.108, రూ.117 వరకూ తీసుకెళ్లిన ఘనులు.. రాష్ట్ర ప్రభుత్వం ధర తగ్గించాలంటూ ఆందోళన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో దెబ్బపడగానే దిగొచ్చి నాటకాలాడుతున్నారు. గ్యాస్‌పై లాభం గడించట్లేదా? రాష్ట్రంలో 2014 నుంచి పెట్రోలు, డీజిల్‌పై 31 శాతం వ్యాట్, అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక లోటు పూడ్చేందుకు రూ.4 అదనపు సెస్సు, రహదారుల అభివృద్ధికి రూ.1 సెస్సు వసూలు చేస్తుంటే.. ధరలు తగ్గించాలంటూ ఇప్పుడు భాజపా నేతలు ధర్నా చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే తగ్గించింది. ఏటా సెస్సుల రూపంలో వసూలు చేస్తున్న రూ.2.87 లక్షల కోట్లలో పైసా తగ్గించలేదు. ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్సుల పేరుతో భారం మోపుతోంది’ అని నాని ధ్వజమెత్తారు. వాస్తవాలు చెప్పేందుకు ప్రకటనలివ్వడం ప్రజాధనం దుర్వినియోగమా అని ప్రశ్నించారు. ‘రోడ్లకు మరమ్మతులు చేస్తే అయిదేళ్లయినా బాగుంటాయి. మేం అధికారంలోకొచ్చిన ఏడాదికే రోడ్లు పాడయ్యాయంటే అర్థమేంటి? తెదేపా హయాంలో రహదారులు వేయకుండా డబ్బు తినేసి ఉండాలి లేదా నాసిరకంగా వేసి ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.
ఆదాయం మీకు.. భారం మాపైనా?