విజయవాడ నగరంలో కురుస్తున్న వర్షాలకు కొండ ప్రాంతాల్లో ఇళ్ళు కూలి పోతున్నాయి. నగరంలోని భవానీపురం, విద్యాధరపురంలలో 5 ఇళ్లు నేలమట్టమయ్యాయి. విద్యాధరపురంలోని నాలుగు స్తంభాల కూడలిలో కొండ చరియలు విరిగి పడి వ్యక్తి మృతిచెందాడు. పీవీవీ వెనుక ఎస్వీఆర్ ఆసుపత్రి రోడ్డులో భారీగా నీరు చేరింది. వరద కారణంగా కాలనీ వాసులు..,స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండప్రాంత వాసులను పునరావాస కేంద్రానికి తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ జోనల్ కమిషనర్ డాక్టర్ రవిచంద్ర వెల్లడించారు.
చెరువును తలపిస్తున్న ఆసుపత్రి
భారీ వానలకు విజయవాడ నగరంలోని గుణదల ఈఎస్‌ఐ ఆసుపత్రి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఆసుపత్రిలోపలికి వెళ్లే దారిలో భారీగా వర్షపు నీరు నిలిచింది. ఆసుపత్రిలో లోపల రోగులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. గుణదల కొండ ప్రాంతం నుంచి దిగువకు వచ్చే నీటికి తోడు.. మురుగునీటి కాల్వలు ఉప్పొంగుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. గుణదల, క్రీస్తురాజపురం, లయోలా కళాశాల ప్రాంతం, నిర్మలా కాన్వెంట్ రోడ్డు జలమయమయ్యాయి. నగరపాలక సంస్థ యంత్రాంగం మోటార్ల సాయంతో రహదారులపై నిలిచిన నీటిని తోడేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
తిరువూరు మండలం టేకులపల్లి, గానుగపాడు గ్రామాల మధ్య ఎదుళ్ల వాగు, చెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగు దాటే ప్రయత్నం చేస్తున్నారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు ఇళ్లలోకి భారీగా వాన నీరు
నందిగామలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. స్థానిక బీసీ కాలనీ, దుర్గ నగర్, అశోక్ నగర్ లలో ఇళ్లల్లోకి వర్షం నీరు చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని కొండాపురం, చందాపురంలోని విద్యుత్ సబ్ స్టేషన్లు చెరువును తలపిస్తున్నాయి. కార్యాలయాల్లోకి వరద నీరు చేరింది. విద్యుత్ సబ్ స్టేషన్ పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఇళ్లల్లోకి చేరిన వరద నీరు చేపల కోసం ఎగబడ్డ స్థానికులు
కృష్ణాజిల్లా నూజివీడులోని పెద్ద చెరువు, కళింగ వాగు పొంగి పొర్లుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకుని చేపలు పట్టుకుంటున్నారు. కరోనాను సైతం లెక్కచేయకుండా గుంపులు గుంపులుగా చేపలు పట్టడం పట్ల పట్టణ ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
వాగులను తలపిస్తున్న రహదారులు
భారీ వర్షాల కారణంగా వీరులపాడు, కంచికచర్ల, చందర్లపాడు మండలాల పరిసర ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద వర్షపు నీరు భారీగా చేరుకుంది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వీరులపాడు మండలం జూజ్జూరు గ్రామంలో బీసీ కాలనీ, ముస్లిం కాలనీల్లో ఇళ్లలోనికి వర్షపునీరు చేరింది. లక్ష్మయ్య వాగు రహదారిపై ప్రవహించటంతో కంచికచర్ల, చెవిటికల్లు గ్రామాల మద్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంచికచెర్ల, మధిర ప్రధాన రహదారి వాగును తలపిస్తోంది. రహదారి కనిపించకుండా చేరిన వరద నీటితో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మునగచెర్ల వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రాష్ట్ర సరిహద్దు వద్ద రహదారి పరిస్థితి నిండు కుండలా చెరువులు
కృష్ణాజిల్లా నందిగామ మండలం చెర్వుకొమ్ముపాలెంలో చెరువు నిండుకుండలా మారింది. తూముల సామర్థ్యం సరిపోకపోవటంతో చెరువుకు గండి కొట్టి నీటిని బయటకు పంపుతున్నారు. ఏనుగు గడ్డ వాగు పొంగి పొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో...పుల్లూరు చెరువు పరవళ్లు తొక్కుతోంది. పల్లపు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉండటంతో నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బలహీనపడుతున్న కరకట్టలు
భారీ వర్షాలకు కాల్వల వెంబడి కరకట్టలు బలహీనపడుతున్నాయి. పామర్రు వద్ద బందరు కాల్వ కరకట్ట ప్రమాదకరంగా మారింది. గ్రామంలోని రామాంజనేయ కాలనీ వద్ద కరకట్టకు భారీ బీటలు ఏర్పడ్డాయి. కాల్వ వెంబడి చెట్లు పడిపోతున్నాయి. విద్యుత్ తీగలపై చెట్లు పడుతుండడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. పంట పొలాల్లోకి వర్షపు నీరు భారీగా చేరుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విరిగిపడ్డ కొండచరియలు
గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఘాట్‌రోడ్‌లోని ఓంకారం మలుపు వద్ద రాళ్లు రోడ్డుపైకి వచ్చి పడ్డాయి. ఈ ఉదయం ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా భక్తులెవరిని ఘాట్ రోడ్డు నుంచి అనుమతించటం లేదు దీంతో ప్రాణ నష్టం తప్పింది.
హెచ్చరిక నోటీసులు
ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసానికి రెవిన్యూ అధికారులు వరద హెచ్చరిక నోటీస్ జారీ చేశారు. ఈ నెల 16వ తేదీ వరకు దాదాపు 5లక్షల క్యూసెక్కులపైగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వరద ఉద్ధృతి పెరుగుతున్నందున సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు. కరకట్ట సమీపంలోని అన్ని నివాసాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
కృష్ణా జిల్లాలో వర్షబీభత్సం ఇదీచదవండి
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు