ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నువ్వైనా చెప్పవే! ఎలా జరిగిందో... ఎవరు చేశారో..?

ఓ బావి.. నువ్వే చెప్పాలి నిజమేంటో.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మంది నీలో శవాలై తేలారు. ముక్కు పచ్చలారని మూడేళ్ల చిన్నారి నుంచి యువకులు, మహిళలు, ఇంటిపెద్దలు సహా అందరూ విగత జీవులై ఈ లోకాన్ని వీడారు. అంతులేని ఈ విషాద ఘటనకు నువ్వే మౌన సాక్షి. అంతు చిక్కని ఈ మరణాల వెనక దాగున్న రహస్యమేంటి? ఈ మరణ మృదంగానికి మౌన సాక్షివి నువ్వు కాకుంటే మరి ఇంకెవరు?

warangal rural district Gorrekunta well mysterious deaths special story
warangal rural district Gorrekunta well mysterious deaths special story

By

Published : May 24, 2020, 2:23 PM IST

తెలంగాణలోని వరంగర్​ గ్రామీణ జిల్లా గొర్రెకుంట బావి కథకు ముగింపు పలికేందుకు పోలీసులు రాత్రింబవళ్లు అనేక మార్గాల్లో అన్వేషిస్తున్నా కొత్త మలుపులు తిరుగుతున్నాయే తప్ప అసలు సంగతేంటనేది అర్థం కావడం లేదు. ఎక్కడో పశ్చిమ బంగ నుంచి పొట్ట చేత పట్టుకుని దశాబ్దాల క్రితం ఓరుగల్లును నమ్ముకుని వలస వచ్చిన కుటుంబం కథ చివరకు విషాదాంతమైంది.

మృత్యువాత పడ్డ మరో ముగ్గురూ బతుకుదెరువు కోసం ఉన్న ఊరును విడిచి కన్నవారికి దూరమై ఉపాధి కోసం కార్మికుల అవతారమెత్తి కష్టపడడానికి ఇక్కడికి వస్తే కనీసం అయిన వారి చివరి చూపునకు నోచుకోకుండా కానరాని లోకాలకు వెళ్లారు. ఈ మరణ మృదంగానికి బావి.. మౌన సాక్షివి నువ్వు కాకుంటే మరి ఇంకెవరు?

ఎన్నటికి తెలిసేను..?

ఈ చావుల గుట్టు ఎప్పటికి వీడేను? ఎన్ని ఆధారాలు దొరికినా, ఇంకెన్ని ఆనవాళ్లు బయట పడ్డా ఈ మరణాలకు మూలమేంటని అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. గురువారం మధ్యాహ్నం గొర్రెకుంటలో ఉన్న నీలో నాలుగు మృతదేహాలు కనిపించడంతో అల్లకల్లోలం మొదలైంది. నాలుగు చావులతో ఆగకుండా మరో అయిదుగురి ప్రాణాలూ నీలోనే కలిసిపోయాయనే చేదు నిజం మర్నాడు తెలిసింది. మొదట ఆత్మహత్యగా అనుకున్నా, తర్వాత కచ్చితంగా ఇవన్నీ హత్యలేనని పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నారు.

మరి అంత మందిని చంపే చేతులు ఎవరికొచ్చాయి, ఇంత మందిని బలితీసుకునేంత అవసరం ఏముంది? విందులో గొడవ జరిగిందా? కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందా? అనైతిక వ్యవహారాలే అసలు కారణమా? మరెవరైనా పగబట్టి తొమ్మిది మందికి విషమిచ్చి నీలో తోసేశారా? ఈ అంతుచిక్కని రహస్యాన్ని సాంకేతికతతో కూడిన మొబైల్‌ ఫోన్లు చెప్పడం లేదు. వైద్య పరీక్షలు చేసినా ఇప్పుడిప్పుడే కారణం కచ్చితంగా తేలడం లేదు. ఎంత మందిని విచారించినా స్పష్టత రావడం లేదు. అసలు ఈ మిస్టరీ వీడేదెలా అని అటు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అనేక సందేహాలతో కూడిన వీరి మరణాల వెనకున్న కుట్ర ఏంటని మానవత్వం ఉన్నవారంతా కన్నీరు కారుస్తున్నా, ఈ ఘోరాన్ని చూసిన వారెవరూ లేరు. తొమ్మిది మంది మరణాలకు ఏకైక మౌన సాక్షివి నువ్వే. ఇంతమంది చావులు వెనక కారణమేంటనేది ఓ బావీ నువ్వైనా చెప్పవే!

సంబంధిత కథనం:తెలంగాణ: ఇంకా తేలని మృతుల మిస్టరీ

ABOUT THE AUTHOR

...view details