ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ నగర పాలిక ఓటింగ్ శాతంపై ప్రతిపక్షాల అనుమానం - municipal elections in vijayawada

విజయవాడ నగర పాలిక ఓటింగ్ శాతం ఖరారులో తీవ్ర గందరగోళం నెలకొంది. ఓటర్ల జాబితాతో అధికారులు ఆటలాడుకోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలైన ఓట్లు ఎంత శాతం అని నిర్థరించేందుకు జాబితాలోని 40వేల ఓట్లు తగ్గించడం వెనుక ఆంతర్యం ఏంటన్నది అర్థంకాని ప్రశ్నలా మిగిలింది.

voting in vijayawada
విజయవాడ నగర పాలిక ఓటింగ్

By

Published : Mar 12, 2021, 7:20 AM IST

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో.. ఓటింగ్ శాతం గందరగోళం రాజకీయ వర్గాలను కలవరపెడుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి అధికారులు గంటకో లెక్క చెప్పడంపై పార్టీలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఓట్లతో పాటు.. జాబితా మార్చడం, మొత్తం ఓట్లు తప్పనడం వంటి పరిణామాలు.. మొత్తం పోలింగ్ శాతంపైనే ప్రభావం చూపాయి. ఎట్టకేలకు గురువారం పోలింగ్ శాతం 63.02 శాతంగా తేల్చారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం ఓటర్లు తగ్గారని పోలింగ్ ముగిశాక అధికారులు ప్రకటించడంపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

'పొంతన లేని సమాధానాలు'

మొత్తం 4 లక్షల 66 వేల458 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని 10వ తేదీన చెప్పిన అధికారులు.. గురువారం 4 లక్షల 67వేల 462 మందే ఓటు వేశారని ప్రకటించారు. ఓటింగ్ రోజు డివిజన్ల వారీగా ప్రకటించిన జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 7లక్షల 81 వేల 883గా ఉంది. ఇప్పుడు అనూహ్యంగా మొత్తం ఓటర్లు 7 లక్షల 41 వేల 747మాత్రమే అని కొత్తరాగం అందుకున్నారు. మరి మిగిలిన 40వేల 136 మంది ఏమై పోయారని ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు.

లెక్కలు తారుమారయ్యాయి: ప్రతిపక్షాలు

విజయవాడ నగరపాలిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార, ప్రతిపక్షాలు.. గెలుపు అవకాశాలపై ధీమాతో ఉన్నాయి. ఈ సమయంలో ఎన్నికల నిర్వహణలో లోపాలు తలెత్తడం గందరగోళ పరిస్థితులకు దారితీశాయి. ఒక డివిజన్‌లోని ఓట్లు మరో డివిజన్‌కు వెళ్లాయి. ఇంటి డిజిటల్‌ నంబర్ల వల్ల ఇలా మారి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. అలా మారినప్పుడు ఆ డివిజన్‌ ఓటరుగానే పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం అలాంటి ఓట్లను తిరిగి తొలగించామని అధికారులు చెబుతున్నారు. ఓ మంత్రి ఆదేశాల మేరకు ముందస్తుగానే డివిజన్ల ఓట్లు చెల్లా చెదురు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రణాళిక ప్రకారం ఓట్ల లెక్కలు తారుమారు చేశారని ప్రతిపక్షాలు సైతం అనుమానిస్తున్నాయి.

సత్యనారాయణపురం పోలింగ్‌ కేంద్రంలో ఖాళీ బాలెట్‌ బాక్సులకు వస్త్రం చుట్టి స్ట్రాంగ్‌ రూంలకు తరలించడంపై నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బందరు నగర పాలికతో పాటు.. మిగిలిన పురపాలికల్లో పోలింగ్‌ ముగిసిన గంటలోపే ఖచ్చితమైన లెక్కలు ఎన్నికల సంఘానికి నివేదించారు. వీఎంసీలో మాత్రం ఇంత వరకు స్పష్టత రాలేదు.

వీఎంసీలో 4లక్షల 66వేల 458 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తొలుత లెక్క వేసిన అధికారులు.. గురువారం 4లక్షల 67వేల 462 మంది తేల్చారు. దీని ప్రకారం మరో వెయ్యి ఓట్లు పెరిగాయి. పోలింగ్‌ శాతం 62.89శాతంగా తొలుత ప్రకటించిన అధికారులు.. దీన్ని 63.02కు తెచ్చారు. ఈ గందరగోళంపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ల జాబితాలో డూప్లికేట్‌ పేర్లను తొలగించడం వల్ల మొత్తం ఓటర్లు తగ్గిపోయాయన్నది ఉన్నతాధికారుల సమాధానంగా తెలుస్తోంది .

ఇదీ చదవండి:

బెజవాడ మేయర్‌ పీఠం: కీలకంగా మారనున్న ఎక్స్​అఫీషియో ఓట్లు..!

ABOUT THE AUTHOR

...view details