మారిన వాతావరణంతో తెలంగాణ రాష్ట్రం గ్రేటర్ హైదరాబాద్‌పై వైరల్ జ్వరాలు పంజా విసురుతున్నాయి. చిన్న, పెద్ద జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షం, చల్లటి గాలులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బయట రోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో గత రెండు రోజులుగా ఓపీ సంఖ్య 2 వేలు దాటుతోంది. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి సాధారణ రోజుల్లో 200-300 రోగులు వస్తే.. ప్రస్తుతం 500 దాటుతోంది. ఇంట్లో ఒకరి నుంచి మరొకరికి వేగంగా వైరల్ జ్వరాలు సోకుతున్నాయి. రోగుల్లో 70-80 శాతం మంది ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, తుమ్ములు, దగ్గు, కళ్ల వెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు, జ్వరం తదితర లక్షణాలతో వైద్యులను ఆశ్రయిస్తున్నారు.
తేడా గుర్తించాలి..
*వానాకాలంలో వైరల్ ఫీవర్లతోపాటు డెంగీ, మలేరియా జ్వరాలు పొంచి ఉంటాయి. ఇంటి చుట్టూ, రోడ్లపై వాన నీరు నిల్వ ఉండటం.. మురుగు కాల్వలు పొంగి, డెంగీ, మలేరియా కారక దోమలు పెరగటానికి దోహదపడతాయి.
*పసి పిల్లలు, వృద్ధులు, మధుమేహం బాధితులు, గర్భిణులు, గుండె జబ్బులున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువ. వీరు త్వరగా వైరల్ జ్వరాల బారిన పడే ప్రమాదం ఉండడం వల్ల తగిన జాగ్రత్తలు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
*వైరల్ జ్వరాల్లో తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కు నుంచి నీళ్లు కారడం, తీవ్ర బడలిక, పిల్లల్లో నీళ్ల విరోచనాలు, వాంతులు అవుతాయి. కొందరిలో ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. 3-4 రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతాయి.