విజయవాడ నగర శివారులో కాల్పుల ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. పోలీసు కమిషనరేట్ కార్యాలయ ఉద్యోగి గజకంటి మహేష్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. నున్న బైపాస్ రోడ్డులోని సాయిరూపా బార్ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మహేష్ తన స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికొచ్చి పది రౌండ్లు కాల్పులు జరిపారు. మహేష్ శరీరంలోకి 3 తూటాలు దూసుకెళ్లగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్నేహితుడు హరికృష్ణకు సైతం బుల్లెట్ గాయాలయ్యాయి.
మహేష్‌ను స్నేహితులు హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించినప్పటికీ... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన హరికృష్ణ చికిత్స పొందుతున్నాడు. కాల్పులు జరిపిన అనంతరం ఘటనలో గాయపడ్డ హరికృష్ణ కారులోనే హంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడికి వారు ఏ విధంగా వచ్చారనేది తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి 5 కిలోమీటర్ల దూరంలోని ముస్తాబాద్‌కు వెళ్లే మార్గం వద్ద ఓ కలప డిపో ముందు కారును వదిలేసి దుండగులు పరారయ్యారు. ఆ మార్గంలోని సీసీ ఫుటేజీ దృశ్యాల పరిశీలనపై పోలీసులు దృష్టి సారించారు.
సీసీఎస్, శాంతి భద్రతల విభాగానికి చెందిన మొత్తం 6 బృందాలు హంతకుల కోసం గాలిస్తున్నాయి. 2014 తర్వాత కమిషనరేట్ పరిధిలో తిరిగి మళ్లీ కాల్పుల ఘటన చోటుచేసుకున్నందున పోలీసులు కేసును సవాల్‌గా తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఆరు బుల్లెట్లు, షెల్‌లు స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ, బుల్లెట్లు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. హత్యకు గల కారణాలు తెలుసుకొనేందుకు మృతుడి కుటుంబసభ్యులు, స్నేహితులను విచారిస్తున్నారు. నేరస్థులు తెలుగులోనే మాట్లాడుకున్నందున స్థానికులే అయి ఉంటారని భావిస్తున్నారు.