కొవిడ్-19 నియంత్రణా చర్యలు పాటిస్తూ దసరా నవరాత్రుల్లో అమ్మవారి దర్శనానికి ప్రతిరోజూ పది వేల మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తామని ఎంవీ సురేశ్ బాబు తెలిపారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా టైం స్లాటు ప్రకారం ఆన్లైన్లో టిక్కెట్లు పొందాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం భక్తులు, సిబ్బంది భద్రత దృష్ట్యా అన్ని ప్రత్యేక పూజలు పరోక్షంగా మాత్రమే నిర్వహిస్తామని... పరోక్ష పూజ టికెట్లు అన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని చెప్పారు.
అక్టోబరు 15 నుంచి ప్రతి 3 రోజులకు ఒకసారి దేవస్థానంలోని అన్ని విభాగాల సిబ్బందికి కరోనా రాపిడ్ టెస్టు నిర్వహిస్తామని సురేశ్ బాబు తెలిపారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల సమయంలో నిర్వహించే నగరోత్సవ కార్యక్రమం ఈ ఏడాది ఆలయ ఆవరణలో మాత్రమే నిర్వహిస్తామని చెప్పారు. దసరా మహోత్సవాల్లో ప్రసాదం పంపిణీ, వేదసభ నిర్వహణ, సుహాసినీ పూజ, కుమారిపూజ, డెప్యుటేషన్ సిబ్బందికి విధులు కేటాయింపు... భక్తులకు వసతి తదితర అంశాలపై చర్చించారు.