ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అతని రంగుల కల... ఆమె బంగారు విజయం - జిమ్నాస్టిక్​లో రాణిస్తున్న విజయవాడ అమ్మాయి

కలలు కనడానికి హద్దులెందుకు? భవనాలకి రంగులు వేసి రోజులు గడిపే షేక్‌గౌస్‌ కూడా ఇలానే ఆలోచించాడు. ‘ఆడపిల్లకి ఇవన్నీ ఎందుకు?’ అనుకోకుండా తన కూతురి బంగారు కలలకి రెక్కలు తొడిగాడు. ఆ తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే నేడు యాసిన్‌ జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయవాడ అమ్మాయి గెలుపు కథ ఇది..

His colorful dream
His colorful dream

By

Published : Feb 4, 2022, 9:08 AM IST

యాసిన్‌ తండ్రి షేక్‌గౌస్‌, తల్లి పర్వీన్‌. వీళ్లకు ఇద్దరూ ఆడపిల్లలే. గౌస్‌ది ఇళ్లకు రంగులు వేసే పని. రోజూ వాకింగ్‌కి వెళ్లే అలవాటున్న ఆయన చిన్నకూతురు యాసిన్‌ని కూడా తీసుకుని ఇందిరాగాంధీ స్టేడియానికి వెళ్లేవాడు. అక్కడి క్రీడాకారులు జిమ్నాస్టిక్స్‌ సాధన చేస్తుంటే వాళ్లని కూతురు ఆసక్తిగా కళ్లు పెద్దవి చేసి చూడటం గమనించాడా తండ్రి. యాసిన్‌ నాలుగో తరగతిలో ఉండగా జిమ్నాస్టిక్‌ ఆర్టిస్టిక్స్‌లో చేర్పించాడు. ఆ క్రీడలో త్వరగానే మెలకువలు నేర్చుకున్న యాసిన్‌ కోచ్‌ సురేష్‌ సహకారంతో 2007 నుంచి విజయవాడలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(శాయ్‌)లో చేరి పదేళ్ల పాటు సాధన చేసింది. ఆ తర్వాత కాకినాడ శాప్‌ అకాడమీలో మరింత రాటు తేలింది. కాకినాడ ఐడియల్‌ కళాశాలలో చేరి డిగ్రీ చదువుతున్న సమయంలోనే ట్రాంపోలైన్‌ జిమ్నాస్టిక్స్‌ అనే ప్రత్యేక విభాగంలో జాతీయ స్థాయిలో రాణించి బంగారు పతకాలు సాధించింది. 2019లో సీనియర్‌ నేషనల్‌ పోటీల్లో విజేతగా నిలిచి ఆసియా ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. లాక్‌డౌన్‌ కారణంగా పోటీలు నిలిచిపోయినా నిరాశ పడకుండా తిరిగి సాధన మొదలు పెట్టింది. అలా ఈనెల 9న ముంబయి థానేలోని శ్రవణ్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో జరిగిన ట్రాంపోలైన్‌ ప్రపంచకప్‌ ‌ట్రయల్స్‌లో పోటీపడి ఎంపికైంది. ఈ పోటీలు ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అజర్‌బైజాన్‌లోని బాకులో జరగనున్నాయి. ప్రతిభతో అవకాశాన్ని అందుకున్నా... ఆ కలని నిజం చేసుకోవాలంటే చేతిలో డబ్బు కూడా ఉండాలిగా? ‘ఓ పెయింటర్‌ కూతురుగా అంతర్జాతీయ పోటీలకు వెళ్లే ఆర్థిక స్తోమత నాకుందా? అని మొదట్లో చాలా ఆలోచించాను. అవును మరి. అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగే పోటీలకు వెళ్లాలంటే లక్షా పాతికవేల రూపాయలు వరకూ ఖర్చవుతుంది. అందుకే వెనకడుగు వేశాను. కానీ ‘ఏమైనా సరే నువ్వు పోటీలకు వెళ్లి తీరాలి... అవసరమైతే అప్పు తెస్తాం అంటూ అమ్మానాన్నలు, మావయ్య, కోచ్‌ నాలో ఆత్మవిశ్వాసం నింపారు. మా సంకల్పాన్ని అర్థం చేసుకున్న కొందరు మనసున్న దాతలు ముందుకు రావడంతో నాకు కావాల్సిన డబ్బు అందింది. లేకపోతే ఈ పోటీలకు వెళ్లకుండా ఆగిపోయేదాన్నే. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడమే నా లక్ష్యం’ అంటోంది యాసిన్‌.

ఒలింపిక్స్‌ లక్ష్యంగా....

జిమ్నాస్టిక్స్‌ అంటేనే శరీరాన్ని విల్లులా మారుస్తూ, మెరుపులా దూసుకుపోవాలి. ఈ క్రమంలో ఎన్నో గాయాలు. వాటిని లెక్కచేయకుండా ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం తీసుకురావడమే నా లక్ష్యం అంటోంది యాసిన్‌. ‘అక్కా, నేనూ ఇద్దరం ఆడపిల్లలమే అయినా నాన్న నన్ను అబ్బాయిలా పెంచారు. బహుశా అదే నన్ను ఈరోజు ఇలా అంతర్జాతీయ వేదికపై నిలిచేలా చేసిందేమో. నాన్న నన్ను మంచి ప్రభుత్వోద్యోగిగా చూడాలని కలలు కన్నారు. నా కలతోపాటు ఆయన కలా నెరవేర్చాలని అనుకుంటున్నా’ అనే యాసిన్‌కు అమెరికాకు చెందిన జాడిన్‌వెబర్‌ ఆదర్శ క్రీడాకారిణి అట. యూట్యూబ్‌ సాయంతో ఆమెని అనుసరిస్తూ ఎన్నో మెలకువలు నేర్చుకుంటున్నా అనే యాసిన్‌ ప్రపంచ కప్‌లో విజయం సాధించాలని ఆశిద్దాం.

ఇదీ చదవండి:Trained Dogs Acrobatics: ఏవోబీ సరిహద్దులో అలరించిన శునకాల విన్యాసాలు

ABOUT THE AUTHOR

...view details