TRS and BJP Tweet War : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనకపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జ్వరం వల్ల వెళ్లలేదా.. రాజకీయ వ్యూహమా అనే చర్చకు తెరలేసింది. మరోవైపు ట్విటర్ వేదికగా భాజపా, తెరాస మధ్య యుద్ధం నడిచింది. కేసీఆర్ పదేపదే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని.. ప్రొటోకాల్ పాటించకపోవడం సిగ్గుచేటని భాజపా ట్వీట్ చేసింది. దానికి ట్విటర్లో స్పందించిన తెరాస.. సీఎం ఆరోగ్యం బాగాలేదని.. అయినా ప్రైవేటు కార్యక్రమాల్లో ప్రధానిని ముఖ్యమంత్రి ఆహ్వానించాల్సిన అవసరం లేదని.. కేంద్ర హోం శాఖ నిబంధనలే చెబుతున్నాయని రీట్వీట్ చేసింది. తప్పుదోవ పట్టించేలా చౌకబారు ప్రచారం వద్దంటూ ట్వీట్‌లో తెరాస కౌంటర్ ఇచ్చింది.
ట్విట్టర్ ట్రెండింగ్..
Tweet War Between BJP and TRS : ముచ్చింతల్‌లో 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ' ఆవిష్కరణ సందర్భంగా.. తెరాస శ్రేణులు 'ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ' హ్యాష్ ట్యాగ్‌ను ట్విటర్ ట్రెండ్ చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు, పార్టీ శ్రేణులు ఈ క్వాలిటీ ఫర్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్‌తో 20 వేలకు పైగా ట్వీట్లు చేశారు. వివిధ రంగాల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని, వివక్షను ప్రదర్శిస్తోందని ట్వీట్లలో ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో కేటాయింపులు, రాష్ట్ర విభజన హామీలు, జాతీయ ప్రాజెక్టు హోదా వంటి విషయాల్లో అన్యాయం జరుగుతోందన్నారు.