TSRTC Hikes Ticket Fare : తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఇప్పటికే రౌండ్ అప్ పేరిట, టోల్ ప్లాజాల ఛార్జీలు పెరిగాయని టోల్ గేట్ల వద్ద ఛార్జీలు పెంచారు. ప్యాసింజర్స్ సెస్ కూడా వసూలు చేస్తున్నారు. తాజాగా.. డీజిల్ సెస్ వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణీకుని నుంచి డీజిల్ సెస్ కింద రూ.2, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసుల్లో ఒక్కో ప్రయాణీకుని నుంచి రూ.5లు వసూలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది.
పెంచిన ఛార్జీలు శనివారం నుంచి అమలులోకి వస్తాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస ఛార్జీ రూ.10 కొనసాగుతుందని వెల్లడించింది. రోజు రోజుకూ పెరుగుతున్న డీజిల్ ధరల నేపథ్యంలోనే డీజిల్ సెస్ అమలుచేయాల్సి వస్తోందని.. ప్రజలు సహకరించాలని టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.