Revanth reddy about Assam cm case: అసోం సీఎంపై పోలీసులు నమోదు చేసిన కేసు.. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉందని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తను సూచించిన సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయలేదన్న రేవంత్... ఫిర్యాదు స్వరూపాన్ని మార్చారని పేర్కొన్నారు. బిశ్వశర్మపై మరోసారి ఫిర్యాదు చేసిన రేవంత్... సంబంధింత సెక్షన్ల ప్రకారమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరారు. అసోం సీఎంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు రేవంత్‌కు తెలపగా.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాలు ఉపసంహరించుకున్నట్లు ఆయన ప్రకటించారు. ధర్నా సమయంలో అరెస్టయిన వారిని విడుదల చేయాలని కోరారు.
ఎఫ్‌ఐఆర్ కాపీని పోలీసులు చూపించాలి. వ్యవస్థపై దాడి జరిగితే ఎవరైనా, ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు. జాతీయ స్థాయి మహిళా నేతను అవమానించేలా అసోం సీఎం మాట్లాడారు. హిమంత బిశ్వశర్మపై నామమాత్రపు కేసు నమోదు చేస్తే ఊరుకునేది లేదు. మేం ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలి. -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
తమ ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మొన్న ఫిర్యాదు చేస్తే ఇవాళ ఉదయం వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వారి బాధ్యతను గుర్తు చేసేందుకే ధర్నాలు చేపట్టామన్న రేవంత్... ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినందుకు పోలీసులను అభినందిస్తున్నానన్నారు. అయితే.. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్లుగా కేసు నమోదు ఉందని పేర్కొన్నారు.
నేను సూచించిన సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయలేదు. నా ఫిర్యాదు స్వరూపాన్ని మార్చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఎందుకో సెక్షన్లు మార్చేసి నామమాత్రపు కేసు నమోదు చేశారు. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్లుగా కేసు నమోదు ఉంది. అసోం సీఎంని రక్షించేలా పోలీసులు కేసు నమోదు చేశారు. -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు