రాష్ట్రవ్యాప్తంగా సినిమా ఆడక థియేటర్లు మూతపడి దాదాపు 7 నెలలు కావస్తోంది. ఏపీలో 1,100 సినిమా హాళ్లు ఉండగా.. వీటిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. కరోనా మహమ్మారి.. వీరందరి జీవితాలను కుదేలు చేసింది. లాక్‌డౌన్‌తో థియేటర్లు తెరుచుకోక ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయా.. తమ జీవితం మళ్లీ ఎప్పుడు గాడిన పడుతుందా అని యజమానుల దగ్గర్నుంచి కిందిస్థాయి కార్మికుల వరకు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ సమయం వచ్చింది. అయితే..
అవకాశమిచ్చినా.. తెరవలేం
అన్‌లాక్-5లో భాగంగా ఈనెల 15నుంచి థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. అయితే రాష్ట్రంలో ఎగ్జిబిటర్లు హాళ్లు తెరిచేందుకు సుముఖంగా లేరు. ఫిక్స్డ్ విద్యుత్ ఛార్జీల రద్దు, ఇతర రాయితీలు కల్పించేవరకు థియేటర్లు తెరవలేమని వారు స్పష్టంచేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా హాలు నడవాలంటే సుమారు రూ. 10లక్షల వరకు పెట్టుబడి అవసరమని అంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం థియేటర్లు నడపాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని వాపోతున్నారు. ఈ నిబంధనల వల్ల ఒక్కో ప్రేక్షకుడిపై రూ. 25 అదనంగా భారం పడుతుందని చెప్పారు.
తెరిచినా.. సినిమాలేవి?
తెలుగు సినిమాల విడుదలలు ఉగాది నుంచి ప్రారంభమవుతాయి. పండుగలకు అగ్ర హీరోల చిత్రాలు వస్తుంటాయి. ఆ తర్వాత వేసవి సీజన్ మొదలవుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలు సినిమా విడుదలకు గొప్ప సీజన్‌గా భావిస్తుంటారు. అయితే మార్చిలోనే కరోనా విజృంభించటంతో.. వేసవి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. చిత్రీకరణలూ ఆగిపోయాయి. పూర్తయిన సినిమాలు ల్యాబుల్లో ఉన్నాయి. కొన్ని చిన్న సినిమాలు ఓటీటీ వేదికలుగా ప్రేక్షకుల్ని పలకరించాయి. అన్ని ఖర్చులు భరించి థియేటర్లు తెరిచినా.. ఇప్పటికిప్పుడు విడుదలయ్యే సినిమాలు కనిపించడంలేదని ఎగ్జిబిటర్లు అంటున్నారు.