ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విమానాశ్రయ అభివృద్ధి కోసం భూములిచ్చారు.. పరిహారం అందక నష్టపోతున్నారు

విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో ఉన్నవారు భూములిస్తూనే ఉన్నారు. తమ బతుకులు బాగుపడతాయనే ఆశతో ఎప్పటికప్పుడు విలువైన భూములు ప్రభుత్వం అడిగినప్పుడల్లా ఇస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూములిస్తే ఊళ్లు అభివృద్ధి చెందుతాయని.. తమ జీవితాలు బాగుంటాయని ఆశించారు. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇచ్చిన హామీలు నీటిమూటలవుతున్నాయి. సమస్యలకు పరిష్కారం దక్కకపోగా చేసిన భూ త్యాగాలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కట్లేదని వాపోతున్నారు.

vijayawada airport
విమానాశ్రయ అభివృద్ధి కోసం భూములిచ్చారు.. పరిహారం అందక నష్టపోతున్నారు

By

Published : Nov 19, 2020, 7:12 PM IST

విమానాశ్రయ అభివృద్ధి కోసం భూములిచ్చారు.. పరిహారం అందక నష్టపోతున్నారు

విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. దీనికోసం భూసేకరణ అనివార్యమైంది. గన్నవరం చుట్టుపక్కల గ్రామాల్లో విమానాశ్రయానికి ఆనుకుని దాదాపు 730 ఎకరాలు సమీకరించింది. ముందు తమ భూములు ఇచ్చేందుకు రైతులు వ్యతిరేకించినా.. విమానాశ్రయం అభివృద్ధికి ఇచ్చే భూములకు బదులు రాజధాని అమరావతిలో స్థలాలు కేటాయిస్తామన్న ప్రభుత్వ హామీతో భూములిచ్చారు. అమరావతి రైతుల తరహాలోనే కౌలు ఇచ్చి... 1450 గజాల స్థలాన్ని అమరావతిలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఏళ్లు గడుస్తున్నా సకాలంలో కౌలు డబ్బులు రైతులకు అందట్లేదు. రాజధానిలో భూములు కొందరికే రిజిస్ట్రేషన్ కావటం, ఇచ్చినవి ఎక్కడో స్పష్టత లేకపోవటం, రాజధాని మార్పు ప్రకటన వంటి అంశాలు భూ త్యాగం చేసిన అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన భూమి కేంద్రానికి అప్పగించటంతో.. విమానాశ్రయం అభివృద్ధిలో భాగంగా ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. అటు సరైన పరిహారం అందక, ఇటు ఉన్న భూమిపై అధికారాన్ని కోల్పోయి అన్ని విధాలా మోసపోయామని రైతులు వాపోతున్నారు.

హామీల వర్షం

భూములిచ్చిన రైతులకు అమరావతిలో స్థలంతోపాటు పదేళ్ల పాటు కౌలు డబ్బులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తొలి ఏడాది కౌలు ఎకరాకు 50 వేల రూపాయలుగా నిర్ణయించి, ఏటా రూ. 5 వేల చొప్పున పెంచుకుంటూ వెళ్లేలా రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇళ్లు కోల్పోయిన వారికి నిర్ణీత పరిహారం ఇచ్చి ఆర్​అండ్​ఆర్ ప్యాకేజీ కింది కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పింది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేవరకు అద్దె చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

సరిగ్గా అందని పరిహారం

బుద్ధవరం, దావాజీగూడెం, కేసరపల్లి, అజ్జంపూడి గ్రామాలకు చెందిన దాదాపు 425 మంది నిర్వాసితులకు ఇళ్లు నిర్మించాల్సి ఉంది. భూములిచ్చిన రైతులతో కలిపి మొత్తంగా బాధితులు 500 మందికిపైగానే ఉన్నారు. వీరిలో కొద్దిమందికే కొంతమేరకే పరిహారం అందింది. సకాలంలో కౌలు రాకపోవటం, అమరావతిలో ప్రత్యామ్నాయ స్థలం అందరికీ రిజిస్టర్ కాకపోవటం, కొందరికే లాటరీ పద్ధతిలో కేటాయింపు జరగటం వంటివి తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయని బాధితులు అంటున్నారు.

సినీ ప్రముఖులు అశ్వినీదత్, కృష్ణంరాజులు తమ భూములను విమానాశ్రయం విస్తరణలో భాగంగా ఇచ్చారు. నిర్మాత అశ్వినీదత్ ఇప్పటికే ఈ సమస్యపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాధిత రైతులు కూడా ఇక అధికారుల చుట్టూ తిరగలేక న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి..

ఉరిమిన కడలి.. కకావికలమైన దివిసీమ...

ABOUT THE AUTHOR

...view details