కరోనా విలయతాండవం చేస్తుండటంతో ప్రజల అవసరాన్ని, భయాన్ని సొమ్ము చేసుకుంటూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విక్రయించే కంపెనీలు, డీలర్లు అడ్డగోలుగా ధరలు పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.30-40 వేలుండే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ధరని ఇప్పుడు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు పెంచేశారు. ఇది నిమిషానికి ఐదు లీటర్ల సామర్థ్యం గల కాన్సంట్రేటర్ ధర మాత్రమే. 10 లీటర్ల సామర్థ్యంగలదైతే రూ.1.50 లక్షలకుపైనే ధర పలుకుతోంది. కొన్ని పెద్ద కంపెనీల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కొందరైతే చైనా నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని నాసిరకం కాన్సంట్రేటర్లనూ ఎక్కువ ధరకు అంటగడుతున్నారు. కాన్సంట్రేటర్లతో పాటు...ఆక్సిజన్ సిలిండర్లు, వాటికి అమర్చే వాల్వ్‌లు, మాస్క్‌ల ధరల్నీ భారీగా పెంచేశారు. ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారు.
అనూహ్యంగా పెరిగిన గిరాకీ..!
ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అన్న పరికరం గురించి కరోనా సెకండ్‌వేవ్‌కి ముందు చాలా కొద్ది మందికే తెలుసు. ప్రస్తుతం కరోనా మహమ్మారి బారినపడి, తీవ్ర అస్వస్థతకు గురవుతున్న వారికి ఆసుపత్రుల్లో సకాలంలో పడకలు దొరక్కపోవడం, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఉండటంతో ఇప్పుడు ఎక్కువ మంది కాన్సంట్రేటర్ గురించి ఆలోచిస్తున్నారు. ఇది వరకు దీర్ఘకాలిక అనారోగ్యాలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలున్నవారు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియకపోవడం, మార్కెట్‌లో కొందామన్నా, అద్దెకు తెచ్చుకుందామన్నా ఇది వరకులా ఆక్సిజన్ సిలిండర్లు దొరకకపోవడంతో చాలా మంది వీటిని కొని పెట్టుకోవాలనుకుంటున్నారు. కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక కూడా కొందరికి కొన్నాళ్లపాటు ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. అలా నిమిషానికి ఒక లీటరో, రెండు లీటర్లో ఆక్సిజన్ అవసరమైనవారు కాన్సంట్రేటర్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది.
ఎవరికి ఉపయోగం..!
అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వల్ల ఉపయోగం ఉంటుందని వైద్యులు అంటున్నారు. అనారోగ్య సమస్యలు లేనివారిలో సాధారణంగా ఆక్సిజన్ శాతం 95-100 మధ్య ఉండాలి. 95 శాతం కంటే తగ్గితే ఊపిరితిత్తులకు గాలి సరిగ్గా అందడం లేదని అర్ధం. ఇతర అనారోగ్య సమస్యలున్న కరోనా రోగుల్లో కొందరికి ఆక్సిజన్ 95 శాతం కంటే తగ్గిపోతే వెంటనే ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. అక్కడ బెడ్ దొరికేలోగా ఆక్సిజన్ శాతాన్ని కొంత మేర పెంచేందుకు కాన్సంట్రేటర్ ఉపయోగపడుతుంది. కరోనా నుంచి కోలుకున్న రోగులకూ కొన్నాళ్లపాటు ఆక్సిజన్ ఇవ్వడం కొనసాగించాల్సి ఉన్నా... పడకల కొరత వల్ల ఆసుపత్రులు ఇళ్లకు పంపించేస్తున్నాయి. ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకోమని సూచిస్తున్నాయి. వారికీ ఇవి ఉపయోగపడతాయి. ఇది వరకు నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్ ఇచ్చే కాన్సంట్రేటర్లను చాలా అరుదుగా కొనుగోలు చేసేవారు. ఇప్పుడు వాటికీ గిరాకీ పెరిగింది. సుమారు 90 శాతం వరకు శుద్ధ ఆక్సిజన్ అవసరమైనవారు కాన్సంట్రేటర్‌పై ఆధారపడొచ్చు. అంతకు మించి ఎక్కువ శుద్ధత కలిగిన ఆక్సిజన్ కావాలంటే... సిలిండర్‌పై ఆధారపడటమే మంచిది.
కొందామన్నా దొరకడం లేదు
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మన దేశంలో కొన్ని కంపెనీలు మాత్రమే తయారు చేస్తున్నాయి. ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పెరిగిన గిరాకీకి తగ్గట్టు సరఫరా లేదు. కొన్ని ఇ-కామర్స్ కంపెనీల్లో రూ.40-50 వేలల్లోనే అవి దొరుకుతున్నప్పటికీ... డెలివరీ ఇవ్వడానికి నెల రోజులకుపైనే సమయం అడుగుతున్నారు. వేచి ఉండలేనివారు, తక్షణ అవసరం ఉన్నవారు వైద్య పరికరాలు విక్రయించే డీలర్లు, షాపులపై ఆధారపడాల్సి వస్తోంది. విజయవాడకు చెందిన ఒక డీలరు దిల్లీలోని కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఐదు లీటర్ల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ధరను రూ.1.10 లక్షలు, 10 లీటర్లదైతే రూ.1.40 లక్షలు చెబుతున్నారు. ఈ ధర మరో 10 శాతం పెరగబోతోందని, పాత ధరకు కావాలంటే వెంటనే బుక్ చేసుకోండనీ వాటిని కోరిన వారికి చెబుతున్నారు.
ఎలా పనిచేస్తుంది?