స్థూల జాతీయ ఉత్పత్తిలో కీలక భాగమైన పరిశ్రమల రంగం లాక్డౌన్ కారణంగా తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కోనుంది. లాక్డౌన్ ముగిసిన తక్షణమే తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవసరమైన పెట్టుబడులతో పాటు నిర్వహణ మొత్తాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలూ ఈ లాక్డౌన్ కాలం ముగిసిన అనంతరం పెద్ద ఎత్తున ద్రవ్యరూపంలో సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.
దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచే ఓ కార్యచరణను రూపొందించాలని పరిశ్రమల రంగం ఆశిస్తోంది. లాక్డౌన్ సమయంలో ఉద్యోగులను కొనసాగించటంతో పాటు వారికి పూర్తి మొత్తంలోనూ వేతనాలు అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచించటంతో ఆ మేరకు చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు కల్పించాలని పరిశ్రమలు, వాణిజ్య రంగం కోరుతోంది. లాక్డౌన్ సమయం ముగిసిన అనంతరం ప్రతి పరిశ్రమ తమ ఉత్పత్తికి సంబంధించిన ప్రణాళికల రీ-ఇంజినీరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని భారత పరిశ్రమల సమాఖ్య అభిప్రాయపడుతోంది.