ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైకోర్టు తీర్పు హర్షణీయం...న్యాయం మావైపే ఉంది !

విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాలయ తరలింపు ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఆదేశాలివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమని అమరావతి రైతులు, రైతు కూలీలు పేర్కొన్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముందుకెళ్తున్నా న్యాయస్థానాలు ప్రజల వైపే ఉన్నాయన్నారు. మూడు రాజధానులపైనా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని స్పష్టం చేశారు.

By

Published : Mar 21, 2020, 5:00 AM IST

Updated : Mar 21, 2020, 6:06 AM IST

హైకోర్టు తీర్పు హర్షణీయం...న్యాయం మావైపే ఉంది
హైకోర్టు తీర్పు హర్షణీయం...న్యాయం మావైపే ఉంది

సీఆర్‌డీఏ పరిధిలో ఇళ్ల స్థలాలకు భూముల కేటాయింపులో ప్రభుత్వం చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ రైతులు సీఆర్‌డీఏకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. అమరావతి బృహత్తర ప్రణాళికలో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే గ్రామసభల ఆమోదం తీసుకోవడం తప్పనిసరని, ప్రభుత్వం అవేవీ చేయకుండానే ఇళ్ల స్థలాలకు భూములు కేటాయించిందని లేఖల్లో పేర్కొన్నారు. లేఖలను విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో అధికారులకు అందజేశారు.

మందడం మహాధర్నాలో పాల్గొన్న వారంతా నోటికి మాస్కులు పెట్టుకుని నిరసనలో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఒక్కొక్కరి మధ్య మీటరు దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వెలగపూడి, తుళ్లూరు, పెదపరిమి, రాయపూడి, కృష్ణాయపాలెం, నవులూరు, పెనుమాక, ఎర్రబాలెం, ఉండవల్లి, నీరుకొండ, నిడమర్రు, వెంకటపాలెం తదితర గ్రామాల్లో నిరసనలు, 24 గంటల నిరాహారదీక్షలు యథాతథంగా కొనసాగాయి.

జగన్‌, కరోనా పోవాలి.. అమరావతి రావాలి

కరోనా పేరుతో రాజధాని అమరావతి పరిరక్షణ నిరసన శిబిరాలను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. ప్రభుత్వానికి ఆ అవకాశం ఇవ్వకుండా శిబిరాలను తాత్కాలికంగా ఖాళీ చేసి ఎవరి గృహాల్లో వారు ‘జగన్‌, కరోనా పోవాలి..అమరావతి రావాలి’ నినాదంతో ఉద్యమాన్ని కొనసాగిద్దామన్నారు.

శిబిరాలను ఖాళీ చేయండి

కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని, పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత నిరసనలు కొనసాగించాలని తుళ్లూరు సీఐ శ్రీహరిరావు, పీహెచ్‌సీ వైద్యాధికారి మాధవీలత సూచించారు. ఈ మేరకు తుళ్లూరు, పెదపరిమి తదితర దీక్షా శిబిరాల్లో ఐకాస నాయకులకు నోటీసులు అందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వందల మంది సమూహంగా ఉండటం ప్రమాదకరమన్నారు.

ఉద్యమాన్ని కొనసాగిస్తాం

కరోనా విస్తృతి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రైతు, రైతు కూలీల ఐకాస తీర్మానించాయి. ఒక్కో దీక్షా శిబిరంలో 10 నుంచి 20 మంది మించకుండా నిరసన కొనసాగిస్తామని తెలిపాయి. అమరావతి రైతుల త్యాగాలు, వాస్తవ పరిస్థితులు, వారికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరికీ నివేదికలు పంపించాలని నిర్ణయించాయి.

కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల సూచనల మేరకు ఉద్యమం కొనసాగింపుపై ఐకాస నేతలు అభిప్రాయ సేకరణ చేపట్టి చర్చించారు. అనంతరం ఐకాస కన్వీనర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ.. రాజధాని పరిధిలోని ప్రతి ఇంటిపై అమరావతి జెండాతో పాటు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్ల జెండా ఎగరేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ‘అమరావతి వెలుగు’ పేరుతో ప్రతీరోజు రాత్రి 7.30 గంటలకు విద్యుత్‌ దీపాలను నిలిపేసి, ఇళ్లముందు కొవ్వొత్తులతో నిరసన తెలుపుతామని చెప్పారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి, కో కన్వీనర్‌ తిరుపతిరావు, మహిళా విభాగం నేత సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు తీర్పు హర్షణీయం...న్యాయం మావైపే ఉంది

ఇదీచదవండి

కరోనాపై సీఎం జగన్​కు ప్రధాని మోదీ సూచనలు

Last Updated : Mar 21, 2020, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details