hyderabad paper girls: తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాందాస్ కుటుంబం 20ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. బోరబండలో నివాసముండే ఆయన... మొదట పేపర్‌బాయ్‌గా పని చేసేవారు. తర్వాత.. ఓ పేపర్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది పేపర్‌బాయ్‌లను నియమించుకుని దిన పత్రికలు పాఠకులకు అందేలా చేసేవాడు. సెలవు దినాల్లో కుమార్తెలు పవిత్ర, ప్రమీలలు పేపర్ వేసేవారు. క్రమంగా పేపర్‌బాయ్‌ల సంఖ్య తగ్గటం... తండ్రి ఆర్థిక పరిస్థితి కూడా మునుపటిలా లేక పోవడంతో అక్కచెల్లెళ్లు ఓ ఆలోచనకు వచ్చారు. రోజూ తామే పేపర్ వేయడానికి సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యుల్ని ఒప్పించి... ఇలా పేపర్లు వేయడం మెుదలుపెట్టారు.
లాక్డౌన్ సమయంలో పేపర్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఆదాయం తగ్గిపోవడం వల్ల పేపర్ బాయ్స్‌ను పెట్టుకోకుండా మేమే పేపర్ వేసుకుంటున్నాం. కాలేజీకి వెళ్లినప్పుడు స్టడీ అవర్స్‌లోను, సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత చదువుకుంటాం. ప్రతిరోజు ఉదయాన్నే పేవర్ వేయడానికి వెళ్తాం. పేపర్బాయ్స్ను పెట్టుకునే అవసరం లేకపోవడం వల్ల మా నాన్న.. సంతోషంగా ఉన్నారు.-ప్రమీల, పేపర్ గర్ల్
ఓ పక్క చదువు.. మరో పక్క తండ్రికి సాయంగా
రోజూ ఉదయం 4గంటలకే నిద్ర లేచే అక్కచెల్లెళ్లు...గంటపాటు చదువుకుని 5గంటల నుంచి తండ్రితో కలిసి బోరబండ నుంచి మోతీనగర్కి స్కూటీపై వెళ్తారు. పేపర్ పాయింట్ నుంచి పేపర్లను తెచ్చి వాటిని క్రమపద్ధతిలో పెట్టి.. ఆయా కాలనీల్లో పేపర్లు వేస్తారు. మొదట సైకిల్‌పై వెళ్లి పేపర్ వేసేవారు. అది కొంచెం కష్టంగా ఉండటంతో.. తండ్రి రామ్‌దాస్ స్కూటీ ఇప్పించారు.
ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో డాడీతో పాటు సెలవురోజుల్లో పేపర్ వేయడానికి వెళ్లేవాళ్లం. కొవిడ్ సమయంలో పేపర్ బాయ్స్ రాకపోవడం వల్ల మేము పేపర్ వేయడం మొదలు పెట్టా. చదువు కొనసాగిస్తూనే పేపర్ వేస్తున్నాం. ఉదయం మాత్రమే పేపర్ పని ఉండడం వల్ల.. మిగిలిన టైంలో చదువుకుంటున్నాం. పవిత్ర, పేపర్ గర్ల్
నాన్న నడిచిన బాటలోనే..
paper girls Pavitra and Pamela: కొన్నాళ్లుగా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతగా బాగాలేవు. ఈ నేపథ్యంలో తమ వంతు సాయం చేద్దామని ఈ పనికి సిద్ధమయ్యాం. ఈ పనిని అబ్బాయిలే ఎక్కువగా చేస్తుంటారు. అంతే కానీ, వారు మాత్రమే చేయాలని ఏం లేదు. అందుకే, నాన్న నడిచిన బాటలోనే సంతోషంగా ముందుకెళ్తున్నాం అంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. ఈ పనిలో ఒకప్పుడు బాగా డబ్బులు మిగిలేవని....ఇప్పుడు ఆదాయం తగ్గిందని రాందాస్ చెబుతున్నారు. తక్కువ వస్తున్నాయని బాధపడి ఈ పని వదిలేయలేనన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని నా కుమార్తెలు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని...వాళ్లు ఏం కావాలంటే అది చదివిస్తానని తెలిపారు.