తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం మరో 164 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి తాజాగా 9 మంది మృతిచెందారు. శుక్రవారం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 133నిర్ధరణ అయ్యాయి. మేడ్చల్‌లో 6, రంగారెడ్డిలో 6, సంగారెడ్డిలో 4, నిజామాబాద్‌లో 3, మహబూబ్‌నగర్, కరీంనగర్, ములుగు జిల్లాల్లో 2 చొప్పున, సిద్దిపేట, యాదాద్రి, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, వనపర్తి జిల్లాల్లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే సంగారెడ్డిలో శుక్రవారం 22 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్ఓ మోతీరాం పేర్కొన్నారు.
మొత్తంగా బాధితుల సంఖ్య 4,035కు చేరింది. వలసలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో నమోదైన కేసులు 449కు చేరాయి. తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 4వేల 484కు చేరింది. ఇప్పటి వరకూ 2,0278 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 2,032 మంది వివిధ ఆసుపత్రులు, ఐసోలేషన్‌లలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ మహమ్మారి బారిన పడి 174 మంది మృతిచెందారు.
స్వీయ నిర్బంధంలోకి హరీశ్..
ప్రజాప్రతినిధులనూ వైరస్ వణికిస్తోంది. తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు...హైదరాబాద్‌లోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. సిద్దిపేటలో ఆయన వ్యక్తిగత సహాయకుడికి కరోనా నిర్ధరణ కావడంతో మంత్రితో పాటు ఆయన వెంట ఉండే 51 మందికి పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఫలితాల్లో అందులో మంత్రితో పాటు 17 మందికి నెగెటివ్ వచ్చింది.