తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన... విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో తెదేపా రాష్ట్రస్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో 10 అంశాలపై చర్చించాలని నిర్ణయించుకున్నారు. కిందటి ఎన్నికల ఫలితాలపైనా సమీక్షించనున్నారు. తెదేపా కార్యకర్తలు, ప్రజలపై దాడులు, ఆర్టికల్ 370 రద్దు కశ్మీర్ అంశాలపై చర్చిస్తారు. ఏపీ భూభాగంలోనే గోదావరి అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలనే డిమాండ్‌ను తెరమీదకు తేనున్నారు. స్తంభించిన అభివృద్ధి, రద్దుచేసిన సంక్షేమ పథకాలపట్ల పోరాడేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోనున్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ సమావేశంలో చర్చిస్తారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు, లోక్‌సభ స్థానం యూనిట్‌గా కమిటీల ఏర్పాటుపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అబద్ధాలను సమర్థంగా తిప్పికొట్టిన తీరుపై ప్రధానంగా చర్చిస్తారు.
నేతలతో టెలీకాన్ఫరెన్స్...
రాష్ట్ర స్థాయి సమావేశం సందర్భంగా పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకాపా తప్పుడు విధానాల వల్ల వివిధ వర్గాల వారు ఆత్మహత్య చేసుకునే దుస్థితి నెలకొందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా... ప్రభుత్వంలో చలనంలేదన్నారు. రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెదేపా ఓట్లు పెద్ద ఎత్తున తొలగించాలని తహసీల్దార్‌లకు లక్ష్యాలు నిర్దేశించారని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీనిని గట్టిగా ప్రతిఘటించాలన్న చంద్రబాబు... ఓట్ల తొలగింపుపై న్యాయపోరాటం చేద్దామని చెప్పారు.