TDP private cases on Police: అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిళ్లకు తలొగ్గి చట్ట విరుద్ధంగా వ్యవహరించే పోలీసులపై ప్రైవేటు కేసులు వేయాలని తెలుగుదేశం అధిష్ఠానం భావిస్తోంది. ఇటీవల గౌతు శిరీషకు నోటీసులు, పల్నాడుకు వెళ్లకుండా నేతలను పోలీసులు అడ్డుకోవడం వంటి చర్యలు ఉద్దేశపూర్వకమేనని స్పష్టం చేస్తోంది. వైకాపా ప్రభుత్వంపై నిరసనలకు వెళ్లకుండా విపక్ష నేతలను గృహనిర్బంధం చేస్తున్నారని అనేక సందర్భాల్లో తప్పుపట్టిన చంద్రబాబు.. అందుకు తగ్గ ప్రతిచర్యలు ఉంటాయని ఇటీవలే హెచ్చరించారు. ఆ దిశగానే పార్టీలో కసరత్తు జరుగుతోంది. ఏయే పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు, తప్పుడు కేసులు ఎక్కడెక్కడ పెట్టారు అనే అంశంపై ఇప్పటికే నియోజకవర్గ స్థాయి నుంచి సమాచారం సేకరించారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ జాబితా సిద్ధం చేశారని సమాచారం. ఎస్సై స్థాయి నుంచి అడిషనల్ డీజీ స్థాయి అధికారుల వరకూ ఇందులో ఉన్నట్టు సంబంధితవర్గాలు చెప్తున్నాయి ప్రతి జిల్లా నుంచి దాదాపు ముగ్గురు నలుగురు పోలీసు అధికారులు ఉన్నారని పేర్కొంటున్నాయి. సతరు పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అరెస్టైన వారికీ హక్కుంటాయని.. కస్టడీలోకి తీసుకున్న ఎవరిపైనైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించటానికి వీల్లేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలుగుదేశం ఉదహరిస్తోంది. ఎవరినైనా అరెస్టు చేస్తున్నప్పుడు.. పోలీసులు వారి పేరు, హోదా స్పష్టంగా కనిపించేలా ఉన్న నేమ్ బ్యాడ్జి తప్పనిసరిగా ధరించాలని సుప్రీంకోర్టు నిబంధన విధించిందని గుర్తుచేస్తున్నారు. డీకే బోసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసు ఉన్నతాధికారులు చదవి తెలుసుకోవాలని ఇటీవల స్వయంగా చంద్రబాబే హితవు పలికారు. ఈనేపథ్యంలో అక్రమ కేసుల్ని తీవ్రంగా పరిగణించాలని చంద్రబాబు నేతలకు తేల్చిచెప్పారు.
TDP: ఆ పోలీసులపై ప్రైవేటు కేసులు వేసే యోచనలో తెదేపా !
Chandrababu: అక్రమ కేసులతో వేధించే పోలీసులను ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్న తెలుగుదేశం.. ఆ మేరకు జాబితా సిద్ధం చేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుంటున్న అధిష్టానం.. వారిపై ప్రైవేటు కేసులు వేయాలని యోచిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారికి చట్ట పరిధిలోనే శిక్షపడేలా చేయాలని పట్టుదలగా ఉంది.
గీతదాటే పోలీసుల పట్ల కొందర నేతలు మెతకగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అంతా అధిష్టానమే చూసుకుంటుందనే ధోరణి వీడాలని నేతలకూ స్పష్టంచేస్తున్నారు. గతంలో కూన రవి కుమార్, ఇటీవల కాలంలో చింతమనేని ప్రభాకర్ వంటి వారు ప్రైవేట్ కేసులు వేశారని.. అదే చొరవ మిగిలిన నేతల్లోనూ ఉండాలని పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
ఇదీ చదవండి:రైతుల్లేని రాష్ట్రంగా ఏపీ.. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే క్రాప్ హాలీడేలు: లోకేశ్