రైతుల కోసం తెలుగుదేశం పేరుతో మంగళవారం నుంచి కార్యక్రమం చేపడుతున్నట్లు తెదేపా నేత నిమ్మకాయల తెలిపారు. దీనితో పాటు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిననాటి నుంచి రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తీవ్ర స్థాయిలో వారు మండిపడ్డారు. ప్రధానంగా పింఛన్లు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
''ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే మంగళవారం నుంచి 5 రోజుల పాటు రైతుకోసం తెలుగుదేశం కార్యక్రమం. సీఎం జగన్ రెడ్డి వ్యవసాయానికి సంబంధించి తప్పుడు నిర్ణయాలు తీసుకుని రైతుల్ని మోసగించారు. పంట పరిహారం, ఇన్ పుట్ సబ్సిడీ, పంటల భీమా పథకాలేవీ రైతులకు ఉపయోగపడట్లేదు. 70 శాతం మందికి ఇప్పటికీ ఈక్రాప్ నమోదు పూర్తి కాలేదు. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మోటార్లకు మీటర్లు బిగించాలనుకుంటున్నారు. ధరల స్థిరీకరణ నిధి హామీ విస్మరించారు. వైకాపా కార్యకర్తలకు ఉపాధి కోసమే రైతు భరోసా కేంద్రాలు."-నిమ్మకాయల చినరాజప్ప, తెదేపా నేత.
''జగన్మోహన్ రెడ్డి కన్ను ఎయిడెడ్ విద్యాసంస్థల భూములపై పడింది. దాతల సహాయ సహకారంతో నడుస్తున్న విద్యాసంస్థలను స్వాధీనంచేసుకొనే హక్కు ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నష్టం. ఎయిడెడ్ అధ్యాపకులను, ప్రభుత్వ కళాశాలల్లో నియమించడం ద్వారా దాదాపు 10వేల ఉద్యోగాలభర్తీకి జగన్ ప్రభుత్వం మంగళం. ఎయిడెడ్ సంస్థల్లోని సిబ్బందికి ఇచ్చే జీతాల్లో రాష్ట్రప్రభుత్వ వాటా కేవలం 20 శాతం మాత్రమే. జీతభత్యాల్లో 80 శాతం కేంద్ర ప్రభుత్వసంస్థదే. జాబ్ కేలండర్ అంటూ జాబ్ రిమూవ్ కేలండర్ అమలుచేస్తున్నందుకే నిరుద్యోగులు ఆత్మహత్య.'' - జవహార్, మాజీమంత్రి
''ముఖ్యమంత్రి జగన్ జీవో 217 పేరుతో మత్యకారుల గొంతు కొస్తున్నారు. తక్షణం దానిని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం. తెదేపా హయాంలో మత్యకారులకు సబ్సిడీలో వేట అందించిన పరికరాలను నిలిపివేశారు. మత్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే భీమా కూడా వచ్చే పరిస్థితి లేదు. 217 జీవో కేవలం నెల్లూరు జిల్లాకు మాత్రమే ఇచ్చామని మంత్రి అప్పలరాజు చెబుతున్నారని, జీవోలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అని ఉంది.'' - కొల్లు రవీంద్ర, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు