చంద్రబాబు నివాసంపై దాడితో కౌరవ సామ్రాజ్య అంతం మొదలైందని తెలుగుదేశం నేతలు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకే జోగి రమేశ్ ఆధర్యాన అరాచకానికి దిగారని ధ్వజమెత్తారు. దాడి సమాచారం పోలీసులకు ముందే తెలిసినాఅడ్డుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో వైకాపా, కొందరు పోలీసు అధికారుల పాత్రను నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
GOVERNOR : చంద్రబాబు నివాసంపై దాడి ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన తెదేపా
16:20 September 18
TDP LEADERS AT RAJ BHAVAN
ప్రధాన ప్రతిపక్ష నేత,జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని తెలుగుదేశం నేతలు గవర్నర్‌ను కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈమేరకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత విజ్ఞాపన పత్రాన్ని తెలుగుదేశం నేతలు మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు నివాసం వద్ద వైకాపా కార్యకర్తల దాడిలో పలువురు సందర్శకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారని అంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఫిర్యాదుచేశారు. దాడి చేయడానికి వచ్చిన వారిని చెదరగొట్టకుండా, తెలుగుదేశం మద్దతుదారులపై లాఠీఛార్జి చేశారని పేర్కొన్నారు. వైకాపా కార్యకర్తల దాడిలో బుద్దా వెంకన్న, రాకేష్, చెన్నుపాటి గాంధీ, శ్రావణ్, జంగాల సాంబశివరావుకు తీవ్ర గాయాలైనట్లు వివరించారు.
ముఖ్యమంత్రి నివాసం, డీజీపీ కార్యాలయం, రాష్ట్ర సచివాలయానికి సమీపాన ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడి జరగడం... రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనమని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. దాడికి సంబంధించి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.... జడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు భద్రతను ఎలా విస్మరించారని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. గవర్నర్ తక్షణం జోక్యం చేసుకుని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని... రాష్ట్రంలో శాంతిభద్రతల్ని మళ్లీ గాడిలో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ఎన్నో అంశాలపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా తగిన స్పందన లేదని తెలుగుదేశం విమర్శించింది. గవర్నర్ కూడా స్పందించకపోతే ఇతర రాజ్యాంగ సంస్థల్ని ఆశ్రయించాల్సి వస్తుందేమో అన్నారు.
ఇదీ చదవండి:
KTR: నాకూ డ్రగ్స్‌కీ ఏం సంబంధం? ఏ పరీక్షకైనా సిద్ధమే.. రాహుల్ గాంధీ సిద్ధమా!