ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అక్రమ కేసులతో అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసి రాక్షసానందం పొందటమే సీఎం జగన్ రెడ్డి ప్రథమ కర్తవ్యంలా ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను అక్రమమని.. ఆయన ఖండించారు. కరోనా నుంచి ప్రజలను కాపాడటం కంటే కక్షసాధింపే ముఖ్యమంత్రికి ముఖ్యమా అని నిలదీశారు. తన భర్తను చంపడానికి పథకం సిద్ధం చేశారని రఘురామకృష్ణరాజు భార్య ఆందోళనకు ప్రభుత్వం తక్షణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రఘురామ అరెస్ట్ నుంచి మెడికల్ నివేదిక వరకు అన్నింటిలో జాప్యం, కుట్ర కోణం స్పష్టంగా కనపడుతోందని ఆరోపించారు. కోర్టు ఆదేశాలు ప్రభుత్వం పట్టించుకోదా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో అధికార వైకాపా కక్షసాధింపులతో పరిస్థితులు ఎమర్జెన్సీ రోజుల కన్నా దారుణంగా తయారయ్యాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సొంత పార్టీఎంపీ పైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలకు పరాకాష్ట అన్నారు. ప్రశ్నిస్తే మీడియాను కూడా కేసుల్లో ఇరికించేలా దిగజారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలను బెదిరించి పలు మీడియా సంస్థల ప్రసారాలను చాలా వరకు నియంత్రించారని గుర్తుచేశారు. ఆ మీడియా సంస్థలపై రాజద్రోహం కేసు బనాయించి భావప్రకటన స్వేచ్ఛనూ హరించేస్తున్నారని దుయ్యబట్టారు. మీడియా స్వేచ్ఛ హరించడం.. అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం.. వ్యాపారాలు దెబ్బతీయడం.. వంటి అరాచకాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సోమిరెడ్డి అన్నారు.