అంగన్వాడీలకు న్యాయం చేయకపోతే..,తన ప్రభుత్వాన్ని తానే పతనం చేసుకున్నవాడిగా ముఖ్యమంత్రి జగన్ నిలిచిపోతారని తెదేపా అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. జగన్ తన ధనదాహంతో డ్వాక్రా వ్యవస్థను నీరుగార్చటమే కాక.. కళ్యాణమిత్ర, గోపాలమిత్ర, బీమామిత్రల కడుపుకొట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లక్షా 20 వేల మంది అంగన్వాడీ సిబ్బంది డిమాండ్లను జగన్ పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్న మహిళా సాధికారత, స్త్రీ శిశు సంక్షేమం ఎక్కడున్నాయో అధికార పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు చెప్పాలన్నారు.
పేదల ఇళ్లంటే సీఎం జగన్ రెడ్డికి ద్వేషమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు దుయ్యబట్టారు. పేదలు మంచి ఇళ్లల్లో ఉండటం సీఎంకు ఇష్టం లేదన్నారు. హామీ ఇచ్చినట్లుగా ఉగాది నాటికి ఎంతమందిని పేదలను కొత్త ఇళ్లలోకి పంపుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టకపోగా.., చంద్రబాబు హయాంలో నిర్మించిన వాటిని కూడా పేదలకు దక్కకుండా చేశారని విమర్శించారు. నివాస యోగ్యం కాని చోట్ల పేదల ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు రూ.5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.