వైకాపాకు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలుగు మాహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితా మండిపడ్డారు. ఇక, పోలీసుల వ్యవహార శైలిపై ధ్వజమెత్తిన ఆమె.. డీజీపీపై తీవ్రంగా స్పందించారు. గౌతమ్ సవాంగ్ డీజీపీ(DGP) కాదని.. డైరెక్ట్ జగన్ పాలేరు (DJP)అని ఆమె ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు వైకాపా కార్యకర్తలకు వచ్చింది బీపీ (BP) కాదని.. జగన్ ప్రెషర్ (JP) అని దుయ్యబట్టారు. జగన్ ఒత్తిడితోనే అధికార పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారన్నారు. త్వరలోనే గాజుల చేతులకు ఉన్న పవర్ ఏంటో చూపిస్తామని వైకాపా నాయకులను హెచ్చరించారు. సిల్వర్ స్క్రీన్ మీద నుంచి అప్పుడప్పుడు పొలిటికల్ స్క్రీన్ మీదకు వచ్చి నోటికొచ్చిన్నట్లు వాగి వెళతారని వైకాపా ఎమ్మెలే రోజాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
డ్రగ్ మాఫియాలో ఆరితేరారు..
జగన్ రెడ్డి గ్యాంగ్ డ్రగ్ మాఫియాలో ఆరితేరారని తెదేపా నేత జీ.వీ.ఆంజనేయులు ఆరోపించారు. సీబీఐ కేసులు, డ్రగ్ కేసులతో సీఎం జగన్ నిరాశకు గురవుతున్నారన్నారు. తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తుందన్న విషయం సీఎం సొంత సర్వేలో వెల్లడవటంతో జగన్ ఆందోళనకు గురవుతున్నారన్నారు. జగన్కు సొంత పార్టీలోనే వ్యతిరేకత మెుదలైందన్నారు. జగన్ను పట్టాభి తిట్టలేదన్న జీవీ..అనని మాటలు అన్నట్లు చూపించి సానుభూతి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలకు,దాడులకు సీఎం ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
అధికార బలంతో అరాచకం..
వైకాపా ప్రభుత్వం అధికార బలంతో అరాచకం సృష్టిస్తూ..,ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అరాచకాన్ని ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని ఆయన ధ్వజమెత్తారు. పోలీసు అమరవీరుల సంస్మరణ సభను రాజకీయ వేదికగా మార్చారని ధూళిపాళ్ల విమర్శించారు. అభిమానులకు బీపీ వచ్చి దాడి చేశారన్న ముఖ్యమంత్రి మాటలు..రాజ్యాంగ ఉల్లంఘన కాదా ? అని నిలదీశారు. వైకాపా బెదిరింపులకు తెదేపా సైనికులు భయపడరని తేల్చి చెప్పారు. ప్రజలు చైతన్యవంతులై తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి అదే ఫ్యాక్షన్కు బలవుతారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ హెచ్ఛరించారు. తెదేపా కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ గుంటూరులో జరిగిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోపిడి చేస్తున్నారని దుయ్యబట్టారు.
మంత్రి పదవి కాపాడుకోవటం కోసమే..
మద్యం షాపుల దగ్గరకు వైకాపా నేతలు వెళితే.. సీఎం జగన్ను ఏ స్థాయిలో బూతులు తిడుతున్నారో అర్థమవుతుందని తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంత్రి పదవి కాపాడుకోవటం కోసమే కొడాలి నాని.. చంద్రబాబు, లోకేశ్ గురించి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉప్పు, కారం తామూ తింటున్నామని.. తమకూ బీపీ వస్తుందంటూ చింతమనేని ధ్వజమెత్తారు.
తెదేపాపై కక్ష సాధింపులు..
తితిదే సభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించటం సరికాదని తెదేపా నేత నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. వైకాపా నాయకులు బూతులు మాట్లాడుతూ ప్రతిపక్ష తెదేపాపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. రానున్న రోజుల్లో వైకాపాకు పుట్టగతులుండవని..ఇంతకు పదింతలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
రాజకీయాల్లో ఇదేం సంస్కృతి..
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్ వ్యాఖ్యలపై తెదేపా నేతలు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాయలసీమలో జరిగే ఖూనీల్లో భాగంగానే సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య జరిగిందా ? అని వారు ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణకు వేళైంది కాబట్టే వైకాపా నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్, పెద్జిరెడ్డి మీద కామెంట్లు చేస్తే బాంబులేస్తామని వైకాపా నేతలు మాట్లాడటం ఆక్షేపణీయమన్నారు. రాజకీయాల్లో ఇదేం సంస్కృతని వారు నిలదీశారు.
అరాచకం రాజ్యమేలుతోంది..
ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ల వైకాపా పాలనలో ప్రజలకు మిగిలింది పన్నుల భారమేనని అన్నారు. పతనమైపోతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. సవాంగ్ డీజీపీ పదవికి రాజీనామా చేసి వైకాపా కండువా కప్పుకుంటే మంచిదని హితవు పలికారు.