ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెప్పింది ఒకటి.. చేసేది మరొకటి అంటూ.. రాష్ట్ర సర్కారుపై తెదేపా ధ్వజం - tdp criticizes on cm jagan

వైకాపా ప్రభుత్వంపై తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. చెప్పింది ఒకటి.. చేసేది మరొకటి అని సీఎం జగన్​పై మండిపడ్డారు. రాయలసీమ రైతుల హక్కులను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారని తెదేపా శాసనసభపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

tdp criticizes on ycp government
వైకాపా ప్రభుత్వంపై తెదేపా విమర్శలు

By

Published : Jul 1, 2021, 9:44 PM IST

పేదలను బెదిరించి బలవంతంగా వారితోనే ఇళ్లు కట్టించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు నిలదీశారు. ప్రభుత్వం ప్రకటించిన మూడు ఆప్షన్లలో అత్యధిక మంది కోరుకున్నట్లుగా.. రాష్ట్రంలో 16లక్షల ఇళ్లను ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరాశ్రయ పేదల భవిష్యత్తుతో వైకాపా ప్రభుత్వం ఆటలాడుకుంటోందని, గృహనిర్మాణాన్ని ప్రచార ఆర్భాటంగా చేసుకుని నిరుపేదల ఆశలు.. అడియాసలు చేసేలా ప్రభుత్వ చర్యలున్నాయని విమర్శించారు. ఇళ్ల పేరు చెప్పి ఎన్నిసార్లు కార్యక్రమాలు చేపడతారని మండిపడ్డారు.

తెదేపా హయాంలో పూర్తిచేసిన ఇళ్లకే ఇంకా బిల్లులు ఇవ్వని మీరు కట్టుకునేవారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిర్మాణంలో ఉన్నాయంటున్న 3లక్షల ఇళ్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

రైతుల హక్కులు తెలంగాణకు తాకట్టు: రామానాయుడు

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. రాయలసీమ రైతుల హక్కులను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారని తెదేపా శాసనసభపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి నీరు లేకుండా చేసి రైతుల పట్ల శాపంగా మారుతున్నారని మండిపడ్డారు.'హైదరాబాద్​లోని ఆస్తులు కాపాడుకునేందుకు రాయలసీమ, డెల్టా రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. విద్యుదుత్పత్తి పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ కృష్ణా జలాలను తోడేస్తుంటే.. మన సీఎం లేఖలతో కాలక్షేపం చేస్తున్నారు. పోలవరం నిర్వాసితుల్ని వరదలో ముంచే విధంగా జగన్ రెడ్డి చర్యలు ఉన్నాయి' అని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హామీలు నిలబెట్టుకోవాలి..

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని విస్మరించి నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ. 3200కోట్లకు బదులుగా కంటితుడుపుగా రూ. 550కోట్లు విడుదల చేస్తూ అర్థరాత్రి ఉత్తర్వులు ఇచ్చారని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులకు 10లక్షల పరిహారంతో పాటు ఇళ్లు కట్టించి ఇస్తానని మోసం చేశారని విమర్శించారు.

పీఆర్సీ అమలు ఎండమావిలా మారింది: అశోక్ బాబు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు ఎండమావిలా మారిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ఉద్యోగుల పట్ల జగన్ రెడ్డి అవలంబిస్తున్న తీరుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, ఉద్యోగ సంఘాలు పీఆర్సీ అమలుపై పోరాడితే పార్టీ పరంగా మద్దతు తెలుపుతామని ప్రకటించారు. '2019 జులై నుంచి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాల్సిందే. పీఆర్సీ అమలు, ఐఆర్, డీఏ చెల్లింపు, సీపీఎస్ రద్దుపై ముఖ్యమంత్రి తక్షణమే ప్రకటన చేయాలి. హామీలు అమలు చేయకపోయినా ఉద్యోగులేమీ చేయలేరులే అనే భావన ముఖ్యమంత్రికి తగదు. 11వ పీఆర్సీ ఇంకా అమలుకాకపోయినా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు జూలై 1 ప్రాముఖ్యతను ఎందుకు మర్చిపోతున్నాయి. 3, 4తరగతి ఉద్యోగులకు అన్యాయం చేసేలా ఉద్యోగ సంఘాల తీరుంది. కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్దీకరిస్తానన్న హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలి' అని అశోక్​బాబు డిమాండ్ చేశారు.

పన్నుల భారం మోపిన ఏకైక సీఎం జగన్: కేశినేని

కరోనాతో ప్రపంచమంతా ఆర్థికంగా చితికిపోతే.. ప్రజలపై పన్నుల భారం మోపిన ఏకైక సీఎం జగన్​రెడ్డి అని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నుల వసూళ్లలో పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఇవాళ ఆస్తి పన్ను, రేపు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో ఆస్తి విలువ పెంచి మళ్లీ పిండుకుంటారని ఆరోపించారు. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయంలో తెదేపా ఫ్లోర్ లీడర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్​తో కలిసి కేశినేని నాని ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా తెదేపా హయాంలో రాష్ట్ర వాటా పన్ను తగ్గించారని గుర్తు చేసిన ఆయన.. వైకాపా అధికారంలో పన్ను పెంచి ప్రజలపై భారం మోపారని ధ్వజమెత్తారు. ప్రతి ఆరునెలలకు పన్నుల భారం పెరిగేలా దొడ్డిదారిన ప్రణాళికలు సిద్ధం చేశారని గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, నీటి పన్నుల్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కరకట్ట విస్తరణలో రూ. 17వేల కోట్ల కుంభకోణం: పట్టాభి

ఉండవల్లి - రాయపూడి కరకట్ట విస్తరణలో రూ. 17వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఇసుక, భూ దోపిడీకి కరకట్ట రోడ్డు విస్తరణతో రాజమార్గం వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కరకట్ట వద్ద కృష్ణా నది ఒడ్డున ఉన్న 1689 ఎకరాల విలువైన స్టార్టప్ ఏరియా భూములను కొట్టేసే కుట్ర జరుగుతోందన్నారు. జగన్ రెడ్డి ప్రతినిధులుగా ఇసుక మాఫియాలో ఆరితేరిన నందిగం సురేష్, శ్రీదేవి, ఇతర నేతలు.. కరకట్ట విస్తరణకు శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి స్కెచ్​లు ఏవీ అమలు కానివ్వమని.. అడ్డుకొని తీరుతామని పట్టాభి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి..

అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న మట్టితవ్వకాలు

ABOUT THE AUTHOR

...view details